Suryapet: 'తెలంగాణకు పట్టిన పీడ కాంగ్రెస్ దయ్యమే. రేవంత్ అనే భూతం ఈ రాష్టాన్ని నాశనం చేస్తుంది. అందుకే తెలంగాణాలో నీళ్లు, అభివృద్ధి కుంటుపడ్డాయి' అని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏమడిగినా ఎల్‌నినో సాకుతో కాంగ్రెస్ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. రైతులు పంటలు వేసుకోవాలా వద్దా అని స్పష్టంగా చెప్పమంటే సమాధానమే లేదని పేర్కొన్నారు. 'కన్నెపల్లి పంపుహౌజ్ ఈరోజు ప్రారంభించినా కూడా నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. సాగర్ ఎడమ కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నా కేవలం 7 వేల క్యూ సెక్కులు మాత్రమే ఇస్తున్నారు' అని వెల్లడించారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మన నీళ్లను ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతుంటే కేఆర్ఎంబీకి ఉత్తరం రాయాలనే సోయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఇంతకన్నా తక్కువ నీళ్లు ఉన్న సమయంలోనే పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. ఆనాడే వాళ్ల బాసులైనా చంద్రబాబు మెడలు వంచి తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నాం' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా వచ్చినా పంటలు ఎండబెడుతున్నారు. కండ్లముందే ఆంధ్రకు నీళ్లు దోచుకుపోతుంటే కబోదుల్లా రేవంత్ రెడ్డి, మంత్రులు వ్యవహరిస్తున్నారు' అని మండిపడ్డారు.
'పంటలు పండరానియొద్దనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది. పంటలు పండితే నీళ్లు, కరెంటు, బోనస్‌లు ఇవ్వాల్సి వస్తదనే కుట్రలు చేస్తున్నారు. రైతులపై నిర్లక్ష్యం, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల కోసం కేసీఆర్ ఆనాడే పాదయాత్ర చేసి పంటలు కాపాడాడు అని గుర్తుచేశారు. ఇవ్వాళ రైతుల తరఫున ఎటువంటి పోరాటానికైనా కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఒక్క ఎకరం కూడా ఎండనీయ్యొద్దని మిర్యాలగూడ రైతు ధర్నాలో కేటీఆర్ స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేశారు. మరోసారి పాదయాత్రలు చేసైనా సరే రైతుల పంటలు ఎండకుండా పోరాడతామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.