Tilak Varma Nitish Kumar Reddy Telugu Conversation Video: న్యూజిలాండ్‌పై రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ (51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి (27 నాటౌట్) కీలక భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (43 బంతుల్లో 70), బెవాన్ జాకబ్స్ (46 బంతుల్లో 58) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
లక్ష్య ఛేదనలో ఓ దశలో 70 పరుగులకే భారత్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తిలక్ వర్మ, నమన్ ధీర్ (17 బంతుల్లో 31, ఒక ఫోర్, మూడు సిక్స్‌లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. నమన్ ధీర్ ఔట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి తిలక్ వర్మ చెలరేగి ఆడాడు. ఆఖరి మూడు ఓవర్లలో 46 పరుగులు కావాల్సిన దశలో ఇద్దరు బ్యాట్ ఝులిపించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గ్రౌండ్‌లో జరిగిన ఒక ఆసక్తికర సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి క్రీజులో తెలుగులో మాట్లాడుకున్న వీడియో ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ వేదికపై తెలుగు మాటలు వింటుంటే ఎంతో బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు రెండో పరుగు తీసే సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డు అయింది. తిలక్ వర్మ వెంటనే అసహనంతో "అరేయ్.. కాల్ ఇవ్వలే నువ్వు" అనగా.. నితీష్ రెడ్డి ఎంతో కూల్‌గా స్పందిస్తూ.. "నేను వచ్చేస్తా.. ఆరామ్ సేయ్" అని బదులిచ్చాడు. "రేయ్ నేను ముందొచ్చి నీ కోసం వెయిట్ చేస్తున్నా.." అంటూ తిలక్ వర్మ రిప్లై ఇచ్చాడు. అనంతరం చివరి వరకు ఇద్దరు క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించారు. ఇలా ఇద్దరు తెలుగు క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై మాతృభాషలో ఇలా సరదాగా వాదులాడుకోవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. "మైదానంలో మన తెలుగు కుర్రాళ్ల రచ్చ మామూలుగా లేదు" అంటూ క్రికెట్ అభిమానులు ఈ వీడియో క్లిప్‌ను తెగ షేర్ చేస్తున్నారు.
తిలక్ - నువ్వు కాల్ ఇవ్వలేదు నితీష్ - నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే తిలక్ - రేయ్ రెండు అని చెప్పురా పోనీ ఎంత బాగుందో ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే 😍 https://t.co/pkhzaiWJXZ
— పల్నాడు పెద్దిరెడ్డి (@MrHyperReddy) October 24, 2026