Eatala Rajender Meet Amit Shah: తెలంగాణలో అత్యంత వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అన్నింట్లో ఫెయిలవడం.. ఆరు గ్యారంటీలు నెరవేర్కపోవడం.. ప్రజలంతా కాంగ్రెస్ పాలనపై విసుగుచెందిన వేళ తెలంగాణ బీజేపీ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే తెలంగాణకు పార్టీ బాధ్యులను నియమించగా.. మరికొందరికి పదవులు ఇచ్చారు. ఇలా వేగంగా రాజకీయాలు మారుతున్న సమయంలో అకస్మాత్తుగా ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. అంతేకాకుండా బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సోమవారం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొద్దిసేపు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, పేదలు, రైతుల భూములను '22A' నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా వద్ద ఎంపీ ఈటల రాజేందర్ ప్రస్తావించారు.
ఈ అంశాలపై అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో బీజేపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహిస్తున్న పోరాటాల సరళిని బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి అమిత్ షాకు ఎంపీ ఈటల రాజేందర్ వివరించారు. ఫార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌పై న్యాయస్థానం వేటు వేయడమే కాకుండా అసెంబ్లీ కార్యదర్శి ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందని ప్రకటించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో జరగబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కేంద్రమంత్రి అమిత్ షాతో ఎంపీ ఈటల రాజేందర్ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో దిగ్విజయంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారనే శుభసందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాలను కూడా కేంద్ర మంత్రికి వివరించినట్లు ఎంపీ ఈటల రాజేందర్ వర్గం వెల్లడించింది. అంతేకాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, నిధులపై కూడా కేంద్ర మంత్రి అమిత్ షా వద్ద ఎంపీ ఈటల రాజేందర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తొలి వారంలో పర్యటన
తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ బాధ్యులను నియమించగా.. కొందరికీ అధిష్టానం పదవులు ఇచ్చింది. ఇక పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా అక్టోబర్ తొలి వారంలో తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందింది. ఈ పర్యటనలో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.