Sanna Biyyam Along With Essential Commodities: ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడేలా 15 నెలల పాటు సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దాదాపు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న రోజుల్లోనూ వర్షపాతం తగ్గి, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలకు సిద్ధమవుతోంది.
సన్న బియ్యం సరఫరాపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు..
సన్న బియ్యం సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. కనీసం 15 నెలలకు సరిపడా సన్న బియ్యం బఫర్ నిల్వలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు సరిపడా సుమారు 14 నెలల సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అయినప్పటికీ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో నెలకు సరిపడా నిల్వలను కూడా సమకూర్చుకోవాలన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా రానున్న రోజుల్లో ధాన్యం ఉత్పత్తి, సేకరణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇందుకోసం ఇప్పటినుంచే ఆహార ధాన్యాల నిర్వహణను పెంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల ద్వారా రానున్న 15 నెలల పాటు రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవచ్చని స్పష్టం చేశారు.
రూ.500 బోనస్..
రైతులు తక్కువ కాలపరిమితి గల రకాల సాగు చేపట్టేలా ప్రోత్సహించడంతో పాటు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ వర్తించే ఏడు రకాల సన్న ధాన్యాల వివరాలను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రచారం చేయాలని సూచించారు. ఏ ఏ రకాల ధాన్యానికి ఏ ధర లభిస్తుందనే విషయంపై స్పష్టత ఇస్తే సన్న ధాన్యం సాగుపై రైతులకు పూర్తి అవగాహన ఉంటుందని కూడా సూచించారు.
బియ్యంతో పాటు పప్పు, నూనె, చక్కెర..
తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ సర్కార్ మరో తీపి కబురు చెప్పనుంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న సరుకులతో పాటు మరిన్ని నిత్యావసరాలను పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, పేద మధ్యతరగతి కుటుంబాలకు భారం తగ్గించేలా ఏ వస్తువులను రేషన్ ద్వారా అందించేందుకు వీలవుతుందో అధ్యయనం చేయాలని సూచించారు. అధికారులు రూపొందించే ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘం ముందుంచి, రేషన్ సరుకుల పంపిణీపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. గతంలోనూ రేషన్ ద్వారా బియ్యంతో పాటు పప్పు, నూనె, చింతపండు, కారం, చక్కెర, గోధుమపిండి వంటి నిత్యావసరాలను అందించే ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు కూడా గుర్తుచేశారు.
ప్రైవేట్ మిల్లర్లపై ఆధారపడకుండా..
ఈ సందర్భంగా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వ కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా గోదాముల నిల్వ సామర్థ్యం పెరగకపోవడం సమస్యగా మారిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ధాన్యం నిల్వ సదుపాయాలు సరిపోకపోవడంతో ప్రైవేట్ రైస్ మిల్లర్లపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల టన్నుల సామర్థ్యంతో ఆధునిక పద్ధతిలో గోదాములు నిర్మించాలని ప్రతిపాదించారు. ధాన్యం సేకరణ ఎక్కువగా జరిగే 10 ప్రధాన కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పౌరసరఫరాల సంస్థ అంతర్గత నిధులతో పాటు తక్కువ వడ్డీ రేట్లకు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశాలను పరిశీలించాలని కూడా అధికారులకు సూచించారు.