విద్యాశాఖ కఠిన చర్యలు.. 68 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు!
FRS Attendance: సర్కారు బడులపై విద్యాశాఖ నజర్ పెట్టింది. విధుల్లో అలసత్వం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో 68 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
FRS Attendance: సర్కారు బడులపై విద్యాశాఖ నజర్ పెట్టింది. విధుల్లో అలసత్వం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో 68 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఆర్ఎస్ ఫేస్ రికగ్నైజ్ యాప్ లో హాజరు వేయడంలో అలసత్వం వహించినందుకు ఈ చర్యలు తీసుకుంది. పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరుతున్నా.. డిజిటల్ హాజరు నమోదు చేయకపోవడంపై డీఈవో సీరియస్ అయ్యారు. నిర్ణీత వ్యవధిలోగా వివరణ ఇవ్వనట్లయితే.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో జిల్లా ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపింది.
పాఠశాలలో టీచర్లు, సిబ్బంది సమయపాలన పాటించేలా చేసేందుకు.. విధులకు సక్రమంగా హాజరయ్యే విధంగా చూసేందుకు ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది టీచర్లు ప్రతిరోజూ స్కూల్ కు సమయానికి వస్తున్నా.. ఎఫ్ఆర్ఎస్ యాప్ లో హాజరు నమోదు చేయడంలో తీవ్ర అలసత్వం చూపినట్లు అధికారులు గుర్తించారు. మరికొంత మంది టీచర్లు టెక్నికల్ ఇష్యూస్ నెపంతో హాజరును విస్మరిస్తున్నట్లు సమాచారం.
ఇదే అంశంపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు.. రూల్స్ అతిక్రమించిన 68 మంది టీచర్లు.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత సమయంలోగా సంత్రుప్తికరమైన వివరణ ఇవ్వనట్లయితే.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసింది. స్కూల్స్ పనితీరును మెరుగుపరచడం.. విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల సమయపాలన కీలకమని అధికారులు స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని.. సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే.. వెంటనే అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లాలి తప్ప..హాజరు వేయకపోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఈ చర్యతో జిల్లా వ్యాప్తంగా ఉన్న టీచర్ల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.