SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహం.. !!

Telangana BJP New Strategy: తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన అసలైన రాజకీయ దూకుడును ప్రదర్శించేందుకు సిద్ధమైంది. సార్వత్రిక, శాసనసభ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో.. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో గట్టిగా పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం నూతన వ్యూహాలకు పదును పెడుతోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 11:00 AM IST | Updated: Oct 25, 2026, 11:02 AM IST
Image Credit: T BJP (File Pic/Source)
Join

New Strategy Impletment in Telangana By BJP high command: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతుంది. అందుకు తగ్గట్టు పావులు కదుపుతోంది.  ఇందులో భాగంగా నవంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా , డిసెంబర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ పెద్దలే నేరుగా మైదానంలోకి దిగుతుండటంతో కమల  దళంలో సరికొత్త ఉత్సాహం నిండడమే కాకుండా, రాష్ట రాజకీయాల్లో వేడి ఒక్కసారిగా పెరిగింది.

తెలంగాణలో బీజేపీ వ్యూహం.. 
తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న ఈ ముందస్తు వ్యూహం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఎన్నికల సమయం దాకా వేచి చూడకుండా, నామమాత్రపు విమర్శలతో సరిపెట్టకుండా రెండేళ్ల ముందే కేడర్‌ను సమర శంఖానికి సిద్ధం చేయడం ద్వారా ప్రత్యర్థులను తీవ్ర ఆత్మరక్షణలో పడేయవచ్చని భావిస్తున్నారు. మూడో ప్రత్యామ్నాయంగా మిగిలిపోకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే రేసును నిర్మించడం ద్వారా.. బీఆర్ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కే మేలు జరుగుతుందనే ప్రచారాన్ని ప్రజల మెదళ్లలో నాటేందుకు కమలదళం యత్నిస్తోంది.  

రంగంలోకి మోడీ- షా ద్వయం..

ఢిల్లీ అగ్రద్వయం నేరుగా రంగంలోకి దిగుతుండటంతో తెలంగాణలో బీజేపీ తన అసలైన గేమ్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టినట్లయింది. భవిష్యత్తులో ఎలాంటి తాత్కాలిక పొత్తులు, ఆందోళనలు లేకుండా స్వశక్తితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యంగా కమల దళం పక్కా ప్లాన్లతో అడుగులు వేస్తోంది. రాబోయే నవంబర్, డిసెంబర్ పర్యటనలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారాయి.
       

రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆర్థిక సమస్యలు, విద్యుత్ డిమాండ్, ఎల్‌నినో సవాళ్లు, రైతు రుణమాఫీ హామీల అమలులో ఉన్న సాంకేతిక లోపాలను తమకు అనుకూలంగా మలచుకోవడమే బీజేపీ ప్రథమ లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు, ఓటమి తర్వాత అంతర్గత సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్  ఖాళీ చేసిన ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించి, కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ హైకమాండ్ ఈ కార్యాచరణను రూపొందించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోని వ్యతిరేకతను పక్కాగా ఒడిసిపట్టేందుకు ఢిల్లీ నాయకత్వమే స్వయంగా ఈ గేమ్‌ప్లాన్‌ను పర్యవేక్షిస్తోంది.

అసమ్మతికి తావు లేకుండా.. 
నవంబర్‌లో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ముఖ్యంగా పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కమిటీల పనితీరు, క్షేత్రస్థాయి వ్యూహాలపై దృష్టి సారించనున్నారు. నాయకుల మధ్య సమన్వయం పెంచడం, సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయడం ,  బూత్ స్థాయి సైనికులకు దిశానిర్దేశం చేయడం ఆయన పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అసమ్మతికి తావులేకుండా, పార్టీ లైన్‌దాటి వ్యవహరించే నేతలకు గట్టి సందేశం ఇస్తూనే.. క్షేత్రస్థాయి కష్టపడే కార్యకర్తలకు నేరుగా బాధ్యతలు అప్పగించే దిశగా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.  

తెలంగాణకు కేంద్రం చేసిన సాయం.. 
డిసెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వేళ బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన వివిధ జాతీయ రహదారులు, రైల్వే లైన్లు , ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ, కేంద్ర నిధుల వినియోగంపై స్పష్టమైన విశ్లేషణను ప్రజల ముందు ఉంచడం ద్వారా భావోద్వేగపూరిత, నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


ఢిల్లీ అగ్రనేతలు నేరుగా రంగంలోకి దిగుతుండటంతో తెలంగాణలో బీజేపీ తన అసలైన గేమ్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టినట్లయింది. భవిష్యత్తులో ఎలాంటి తాత్కాలిక పొత్తులు, ఆందోళనలు లేకుండా స్వశక్తితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అంతిమ లక్ష్యంగా కమలదళం పక్కా ప్లాన్లతో అడుగులు వేస్తోంది. రాబోయే నవంబర్, డిసెంబర్ పర్యటనలు తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి సంచలన పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.

సునీల్ బన్సల్ దిశా నిర్దేశం.. 
మరోవైపు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్‌ రాష్ట్ర నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అంటే హైదరాబాద్‌ ఒక్కటే కాదని...కేవలం హైదరాబాద్ స్టేట్‌ ఆఫీసులో తిరిగితే సరిపోదని మండిపడిన ఆయన క్షేత్రస్థాయి వరకు వెళ్లాలని నేతలకు సూచించారు. పని చేయనప్పుడు పదవులు ఎందుకని..వేరే వాళ్లకు ఇచ్చేయాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్లు పార్టీ పదవులకు రాజీనామా చేసి నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలని సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టే వ్యూహం.. 
ఇక నుంచి తెలంగాణలోనే ఉంటానని, అన్నీ పరిశీలిస్తానని స్పష్టం చేశారు. సభలు, మైకులు వంటి అనవసరమైన ఆర్భాటాలు తగ్గించుకోవాలన్నారు. నాయకులు బహిరంగ సభలో మాట్లాడితే వచ్చే ఇంపాక్ట్ కంటే.. ప్రజల్లోకి వెళ్లి చిన్న సమూహం వద్ద నలుగురితో చాయ్ తాగి మాట్లాడినా చాలు.. ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా తిప్పికొట్టాలని ఆదేశించారు. జెన్ జీ ఉద్యమాలను తిప్పికొట్టేందుకు యువతకు సెమినార్లతో వాస్తవాలు వివరించాలని పేర్కొన్నారు. ఎన్నికలకు సీరియస్‌గా  పనిచేయాలని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.


గత ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యేలు, ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ..వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న ఈ ముందస్తు వ్యూహం తెలంగాణపై ఎంత వరకు పని చేస్తోందనేది ఆసక్తికరంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES