High Speed Railway Works: తెలంగాణలో హైస్పీడ్ రైల్వే పనులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసింది. తెలంగాణకు ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల పనులు వేగవంతం చేయాలని కోరింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ - పుణె, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై కారిడార్లకు సంబంధించి హైస్పీడ్ రైల్వే పనులకు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి.. కొన్ని మార్పులను సూచిస్తూ తిరిగి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వ బృందం కేంద్ర మంత్రికి వివరించింది. ఈ మూడు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించలేదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ సీఎం వివరించారు. హైస్పీడ్ రైల్వే పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అలైన్‌మెంట్ ఆమోదించిన తర్వాత భూ సేకరణను ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా అలైన్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు రైల్ భవన్‌లో శుక్రవారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్రానికి అవసరమైన కీలక రైలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించారు. వికారాబాద్ - కృష్ణా కొత్త రైలు మార్గాన్ని (130 కి.మీ.) వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసరాల్లో భారీ సున్నపురాయి నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయని.. దీంతో ఈ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్‌టైల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రికి విన్నవించారు.
హైదరాబాద్ చుట్టూ సుమారు 360 కి.మీ మేర నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) పక్కనే రీజినల్ రింగ్ రైలును అలైన్‌మెంట్ చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను తెలంగాణ సీఎం కోరారు. రీజినల్ రింగు రైలుతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. డోర్నకల్- గద్వాల్, కల్వకుర్తి – మాచర్ల, కాచిగూడ కాచిగూడ –జగ్గయ్యపేట (250 కి.మీ.), పటాన్‌చెరు – ఆదిలాబాద్ (320 కి.మీ.), బోధన్ – లాతూర్ (175 కి.మీ.), అక్కన్నపేట బైపాస్ లైన్ (8 కి.మీ.) మార్గాలను వెంటనే మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞాపనలు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకున్న మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్ సమీప అనంతారం గ్రామంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ డిపో ఏర్పాటుకు అవసరమైన 409 ఎకరాల 1 గుంట భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు ఇప్పటికే అంగీకరించామని తెలిపారు. మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.