మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!
Telangana Employees Mass Casual Leave November 17: తెలంగాణలో సర్కార్ పై ఉద్యోగులు కన్నెర్రజేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ అమలవ్వకపోవడంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Telangana Employees Mass Casual Leave November 17: తెలంగాణలో సర్కార్ పై ఉద్యోగులు కన్నెర్రజేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ అమలవ్వకపోవడంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 17వ తేదీన విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చి 3 ఏళ్లు పూర్తి అవుతున్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ నిరసనను తెలియజేసేందుకు నవంబర్ 17వ తేదీన సామూహిక సెలవులు పెట్టి.. హైదరాబాద్ లో ధర్నా దీక్ష నిర్వహించాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది.
2.2 లక్షల మంది సామూహిక సెలవులకు సిద్ధం:
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.6 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో ఉండగా.. వీరిలో సుమారు 2.2 లక్షల మంది నవంబర్ 17న జరిగే సామూహిక సెలవుల్లో పాల్గొనడానికి ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారని సంఘాల నాయకులు వెల్లడించారు.
ఉద్యోగుల ప్రధాన అభ్యంతరాలు, డిమాండ్లు ఇవే:
సీపీఎస్ రద్దుపై అధ్యయనం చేసేందుకు 3 నెలల్లో రిపోర్టు తెప్పిస్తామని గతంలో సర్కార్ ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు పై ఎలాంటి స్పష్టత లేదు. కాలయాపన చేయకుండా ఉద్యోగసంఘాల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో వెంటనే చర్చలు జరపాలని ఉద్యోగులు కోరుతున్నారు. సీపీఎస్ విధానంలో ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా 10శాతం.. ప్రభుత్వం మరో 10శాతం జమ చేస్తుంది. అయినప్పటికీ.. ఆ నిధులు మార్కెట్ ఒడిదుడుకులకు లోనై స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుండటంతో రిటైర్మెంట్ తర్వాత భద్రత లేకుండా పోతుందని ఉద్యోగులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే రిటైర్డ్ అయిన కొందరు సీపీఎస్ ఉద్యోగులకు నెలకు కేవలం రూ. 1600 నుంచి 5000 లోపు మాత్రమే పెన్షన్ వస్తోందని.. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ మొత్తంలో జీవన సాగించడం అసాధ్యమని సంఘాలు చెబుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తున్న విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు అనుకూలమైన మార్గాన్ని గుర్తించినప్పుడు.. తెలంగాణ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పింఛన్‌తో పాటు ప్రభుత్వ వైద్య సదుపాయాలు కూడా అందకపోవడంతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఉద్యోగి జీవితకాల సేవలకు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే ఆగస్టు 23న ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినట్లు తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ , ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ,రాష్ట్ర ఉపాధ్యాక్షులు పవన్ కుమార్ మ్యాన తెలిపారు. వికారాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ ఆందోళనకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, నవంబర్ 17న జరిగే సామూహిక సెలవులతో పరిపాలన.. విద్యా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: