Delhi Capitals Captain New Captain: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్షర్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తున్నా.. ఈ ఆల్‌రౌండర్ మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో వచ్చే సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారన్న చర్చ మొదలైంది. రెండు సీజన్లపాటు ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్.. రెండు సీజన్లలోనూ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చ లేకపోయాడు. 2025లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ.. 2026 సీజన్‌లో ఆరో స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల్లో కొనసాగించేందుకు అక్షర్ విముఖత చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై జట్టు పెద్దలు ఇప్పటికే అక్షర్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత అక్షర్ పటేల్ పర్ఫామెన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఐపీఎల్ 2026లో 14 మ్యాచ్‌లు ఆడగా.. బ్యాటింగ్‌లో 173 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. అటు టీమ్ ఫలితాలు.. ఇటు వ్యక్తిగత ప్రదర్శన బెటర్‌గా లేకపోవడం కూడా కెప్టెన్సీని వదులుకునేందుకు అక్షర్ పటేల్ సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు అక్షర్ పటేల్‌ను ట్రేడ్ చేసుకునేందుకు ఇతర ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు వచ్చినా.. ఢిల్లీ యాజమాన్యం వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
వచ్చే సీజన్‌కు అక్షర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా తిరిగి ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్‌కు కూడా ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అయితే వీరిద్దరూ కూడా నాయకత్వ బాధ్యతలపై ఇప్పటివరకు పెద్దగా ఆసక్తి చూపలేదని నివేదికలు చెబుతున్నాయి.
ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే తమ కోచింగ్ బృందంలో కీలక మార్పులు చేపట్టింది. సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించగా.. యువరాజ్ సింగ్ అసిస్టెంట్ కోచ్‌గా జట్టులో చేరాడు. చమిందా వాస్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా.. అమిత్ మిశ్రా స్పిన్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. గత కోచింగ్ బృందంలోని హెమంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావుతో ఫ్రాంచైజీ విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మార్పుల నేపథ్యంలో జట్టు నాయకత్వంపైనా కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.