స్కూల్‌కు వస్తున్న ఇద్దరు టీచర్లు.. కానీ చదువుకోవడానికి పిల్లలే లేరు! అసలేం జరిగింది?
Two Teachers No Students: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ స్కూల్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. చదువుకోవడానికి బడిలో ఒక్క స్కూడెంట్ లేకపోయి.. ఇద్దరు టీచర్స్ ఉండడం ఆశ్చర్యంగా ఉందంటూ విద్యావేత్తలు అంటున్నారు. అసలు ఆ స్కూల్‌లో ఒక్క స్టూడెంట్ లేకపోవడానికి గల కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Two Teachers No Students Telugu News: తరగతి గదిలో పిల్లల సందడి అస్సలు లేదు.. బ్లాక్‌బోర్డుపై అక్షరాలు కూడా లేవు... బడి గంటలు, ఆటల అరుపుల్లో పిల్లల మాటలు వినిపించవు.. అయినా సరే.. రోజూ ఉదయాన్నే పాఠశాల గేట్లు తెరుచుకుంటాయి.. సమయానికి ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారవుతూ ఉంటారు.. రోజంతా అక్కడే ఉండి సాయంత్రం తాళం వేసి బడి నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఉంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ విచిత్ర పరిస్థితి ఇప్పుడు సోసల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నాగారం పంచాయతీ పరిధిలోని భోజ్యాతండా ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు అవుతోంది.. అయినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా ఈ స్కూల్‌లో చేరలేదంటే తప్పకుండా నమ్మాల్సిందే.. గతేడాది ఇక్కడ 11 మంది విద్యార్థులు చదువుకోగా.. ఈ విద్యా సంవత్సరంలో వారి తల్లిదండ్రులు అక్కడే దగ్గరే ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపారు... దీంతో ఈ పాఠశాలలో నమోదు సంఖ్య పూర్తిగా తగ్గింపోతూ ఏకంగా సున్నాకు పడిపోయింది.
గతంలో అదనపు కలెక్టర్ చేతుల మీదుగా మొదలైన ఈ బడి.. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని మండల విద్యాశాఖాధికారి (MEO) కూడా స్పష్టం చేశారు. విద్యార్థులు లేకపోవడంతో నిత్యం ఖాళీగా దర్శనమిస్తున్న తరగతి గదుల్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు గంటల తరబడి సమయం గడపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు..
విద్యార్థులే లేని చోట.. ఇద్దరు ఉపాధ్యాయులను అలాగే కొనసాగిస్తూ.. ప్రభుత్వం నెలనెలా వేతనాలు చెల్లించడంపై స్థానికులతో పాటు విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. అలాంటి పాఠశాలల్లో పిల్లలు ఉన్నా.. బోధించేవారు లేక ఇబ్బందులు పడుతుంటే.. ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలో ఇద్దరు టీచర్లను ఉంచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.