మంత్రులకు అగ్నిపరీక్షగా మారిన తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు..
Telangana Graduate MLC Election: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా..! ఈసారి రెండు సెగ్మెంట్లను గెలిచి.. ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని అధికార పార్టీ లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మంత్రులకు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. అటు ఈ ఎన్నికలను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఛాలెంజింగ్‌గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులకు ఈ ఎన్నికలు సవాల్ గా మారాయి. ముఖ్యంగా మంత్రులకు అగ్నిపరీక్షగా మారింది.
MLC Election: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి పీక్స్‌కు చేరింది. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అంతుచిక్కని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ రెండు స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాబోయే స్థానిక సంస్థలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది.ఇప్పటికే తెలంగాణలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. త్వరలో ఖైరతాబాద్‌కు నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ముందుగానే అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్..
ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ రేసులో రాం రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని రంగంలోకి దింపారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ రేసులో సామా రామ్మోహన్ రెడ్డిని రంగంలోకి దింపారు. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఎమ్మెల్సీ ఎన్నికలపై వేగంగా పావులు కదుపుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఎన్నికలను గెలిచేందుకు బీఆర్ఎస్, బీజేపీ మధ్య డీల్ కుదిరిందని కాంగ్రెస్ ప్రచారం హోరెత్తిస్తోంది. అదే ప్రచారం చేయాలని క్యాడర్‌కు నిర్ధేశించినట్టు సమాచారం.
అయితే మార్చిలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ మంత్రులకు అగ్నిపరీక్షగా మారాయనే చర్చ సాగుతోంది. మంత్రి మండలిలో వివేక్ మినహా అందరూ మంత్రులూ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఇంచార్జ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. దాంతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి.
మంత్రుల మెడపై కత్తి..
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల.. నల్లగొండ నుంచి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి.. వరంగల్ నుంచి మంత్రి సీతక్క.. ఇలా ఆరుగురు మంత్రులు ఈ మూడు జిల్లాల నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. అంటే మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి భట్టి సహా ఏడుగురు మంత్రులు జవాబుదారులుగా ఉంటారు. ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగినా ఈ మంత్రులు బాధ్యులు అయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్‌కు ఇన్‌చార్జి మంత్రిగా పొన్నం, రంగారెడ్డి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా దుద్దిళ్ల, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా దామోదర ఉన్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాలకూ సీఎం రేవంత్‌రెడ్డి సహా ఏడుగురు మంత్రులు జవాబుదారులుగా ఉండే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రివర్గంలో 15 మంది ఉంటే. వివేక్ మినహా అందరూ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో స్థానికులుగానో, ఇన్‌చార్జి మంత్రులుగానో ప్రాతనిథ్యం వహిస్తున్నారు.
ఫలితంగా రెండు నియోజకర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం మంత్రులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. రెండు నియోజకవర్గాల పరిధిలో 11 లోక్‌సభ, 77 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వాటిలో ఆరు లోక్‌సభ, 47 అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ నేతలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ స్థానంలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. వాటిలో 29 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ నేతలే ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఒకరు ఉన్నారు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన నలుగురిలో కడియం, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదుకు ఐదు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ఆ పరిధిలోని మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
43 అసెంబ్లీ సీట్లలో ఫలితం..
మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 43 అసెంబ్లీ సీట్లు ఉంటే.. వీటిలో కాంగ్రెస్ ఖాతాలో 18 ఉన్నాయి. బీఆర్‌ఎస్ 17 చోట్ల, మజ్లిస్ 7 చోట్ల, బీజేపీ ఒక స్థానంలో ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన వారిలో దానం, కాలె యాదయ్య, కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికెపూడి కాంగ్రెస్‌కు అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. శాసనమండలి ఏర్పడిన దగ్గరి నుంచి ఒక్కసారి కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్ పట్టభద్రుల సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు. రెండు సార్లు ఇతరుల మద్దతుతో ప్రొఫెసర్ నాగేశ్వర్, ఒకసారి బీజేపీ, మరోమారు బీఆర్‌ఎస్ పార్టీ ఈ సీటు నుంచి గెలిచాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోనే ఉండటంతో ఈ ఎన్నికను ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ దఫా బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నియోజకవర్గం పరిధిలోని పార్టీ మద్దతుదారులు, వామపక్ష భావజాలం కలిగిన పట్టభద్రులు, మైనారిటీ పట్టభద్రుల మద్దతుతో గెలుస్తామన్న ధీమాతో ఉంది.