Telangana SSC Certificate: తెలంగాణలో పదవ తరగతి విద్యార్థులు బిగ్ అలర్ట్. టెన్త్ సర్టిఫికెట్లలో తప్పుల సవరణకు ఇక నుంచి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సీ సర్టిఫికెట్లలోని వివరాల సవరణ ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్ లైన్ లోకి మార్చేసింది. ఇక నుంచి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి మార్పుల కోసం విద్యార్థుల మీ సేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మాన్యువల్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తులను స్వీకరించబోమని.. అన్ని జిల్లాల విద్యాధికారులకు , మండల విద్యాధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
కొత్త విధానం ప్రకారం.. విద్యార్థులు మీ సేవ కేంద్రంలో అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఆ దరఖాస్తును వారు చదివిన పాఠశాల హెచ్ఎం కు ఆన్ లైన్ ద్వారా పంపిస్తారు. హెడ్ మాస్టర్ విద్యార్థి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో వివరాలను పరిశీలించి.. అవసరమైన ధ్రువపత్రాలను ఐఎస్ఎంఎస్ పోర్టల్లో అప్ లోడ్ చేసి తమ అభిప్రాయంతో ఉన్నతాధికారులకు దాన్ని ఫార్వర్డ్ చేస్తారు.
అక్కడి నుంచి దరఖాస్తు మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి కార్యాలయాలకు వెళ్తుంది. పలు స్థాయిల్లో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ తుది ఆమోదం తెలుపుతారు. అనంతరం సవరించిన మెమోను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతారు. అనంతరం విద్యార్థులు దాన్ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
గతంలో.. విద్యార్థులు బ్యాంకు చలాన్‌ల ద్వారా ఫీజులు చెల్లించి, చేతితో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో, కొత్త ఆన్‌లైన్ ప్రక్రియ పారదర్శకతను పెంచుతుందని, సవరణల ప్రక్రియను వేగవంతం చేస్తుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇకపై, చేతితో పంపిన ప్రతిపాదనలను నేరుగా డైరెక్టర్ కార్యాలయానికి పంపినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోబోమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.
Also Read: