Telugu Movie Piracy: కొత్త సినిమా థియేటర్‌లోకి వచ్చిందంటే చాలు.. ఆ మూవీ హీరో, హీరోయిన్‌కు అభిమానుల్లాగా ముందే టికెట్లు తీసుకుంటారు. కానీ లోపలికి వెళ్లి సినిమా చూడకుండా.. మొబైల్ ఫోన్లతో వీడియో తీసి పైరసీ వెబ్‌సైట్లలో పెట్టేస్తున్నారు. ఇలా సినిమాలను అక్రమంగా ఆన్‌లైన్‌లోకి చేరవేస్తున్న నెట్‌వర్క్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసింది. ఒక్కో సినిమాను రికార్డు చేసినందుకు వారికి క్రిప్టో కరెన్సీ రూపంలో రూ.20 వేల చొప్పున చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ అక్రమ కార్యకలాపాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై TGCSB కీలక చర్యలు చేపట్టింది. థియేటర్లలో సినిమాలను రహస్యంగా రికార్డు చేసి.. వాటిని పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తున్న ముఠాను గుర్తించింది. ఈ కేసులో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అరెస్టయిన వారిని కర్నూలుకు చెందిన షేక్ రిజ్వాన్ (19), రాంపోగు అజయ్ (19)గా గుర్తించారు. వీరిద్దరూ విద్యార్థులుగా పేర్కొన్నారు. కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్‌లో ఉన్న ఎస్‌వీసీ సినిమాస్ థియేటర్‌కు వెళ్లి కొత్తగా విడుదలైన సినిమాలను మొబైల్ ఫోన్లతో సీక్రెట్‌గా రికార్డు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ వీడియోలను పైరసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవారు. ఈ వ్యవహారం వెనుక మరో వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా యువకులతో సంప్రదింపులు జరిపి.. వారు రికార్డు చేసిన సినిమాలను ఇతర పైరసీ ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయించి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
ఒక్కో సినిమాను రికార్డు చేసినందుకు ఈ యువకులకు రూ.20 వేల చొప్పున క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ క్రిప్టో మొత్తాన్ని ఇండియన్ కరెన్సీగా మార్చుకున్నట్లు చెప్పారు. తమ వివరాలు బయటపడకుండా ఉండేందుకు నకిలీ గుర్తింపులు, వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించినట్లు వెల్లడించారు. సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేయడమే కాకుండా.. ఆయా వెబ్‌సైట్లలో ప్రకటనలు, లింకుల ద్వారా ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ అప్లికేషన్లను కూడా ప్రచారం చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇందుకు కమీషన్ల రూపంలో క్రిప్టో కరెన్సీని పొందుతున్నట్లు గుర్తించారు. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్నవారితో పాటు నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ నెట్‌వర్క్ ద్వారా రికార్డు చేసి పంపిణీ చేసిన సినిమాల్లో రామాయణ, సీన్, మహాశక్తి, ENE, ఆకాశంలో ఒక తార, OM, కల్ట్, ఆదర్శ కుటుంబం తదితర చిత్రాలు ఉన్నట్లు TGCSB వెల్లడించింది. నిందితుల నుంచి సినిమాలను థియేటర్లలో రికార్డు చేసేందుకు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రూ.33.6 కోట్ల నష్టం నివారణ
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది జనవరి 5న యాంటీ పైరసీ యూనిట్ (APU) ఏర్పాటైంది. డిజిటల్ సినిమా పైరసీని అడ్డుకునేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక విభాగంగా దీనిని ఏర్పాటు చేసినట్లు TGCSB తెలిపింది. ఈ యూనిట్ అధునాతన టేక్‌డౌన్ టూల్స్, నిరంతర వెబ్ నిఘా ద్వారా ఇప్పటివరకు 42,151 పైరసీ లింకులు, URLలను బ్లాక్ చేసింది. ప్రధాన హోస్టింగ్ సర్వర్లకు 87 నోటీసులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది అనుమానితులను గుర్తించగా.. ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. గత ఏడు నెలల్లో 20కి పైగా సినిమాలకు సంబంధించి తీసుకున్న చర్యలతో సుమారు రూ.33.6 కోట్ల మేర సినీ పరిశ్రమకు కలగాల్సిన నష్టాన్ని నివారించినట్లు పేర్కొంది.
తాజాగా జరిగిన అరెస్టులు యాంటీ పైరసీ యూనిట్ అందించిన సమాచారం ఆధారంగా చేపట్టినట్లు TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉందన్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.