TGSRTC Sabarimala Buses: అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శబరిమల పూజా సమయాలకు అనుగుణంగా రెండు విడతల్లో ఈ బస్సులను నడపనున్నారు. మండల పూజ కాలం కోసం నవంబరు 16వ తేదీ నుంచి డిసెంబరు 27వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే మకరవిలక్కు, మకరజ్యోతి కోసం డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు రెండో విడత సర్వీసులు కొనసాగుతాయి.
గురుస్వాములకు ప్రత్యేకాకర్షణలు, కమీషన్..
బస్సుల బుకింగ్ నిర్వహించే గురుస్వాములను ప్రోత్సహించేలా టీజీఎస్ఆర్‌టీసీ పక్కా ప్రణాళిక రూపొందించింది. బస్సు బుక్ చేసిన గురుస్వామికి ఆ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఉచిత ప్రయాణంతో పాటు కమీషన్ ప్రోత్సాహకం కూడా ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ బస్సులను బుక్ చేసే గురుస్వామికి, ఒక బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు అదనంగా బుక్ చేసే ప్రతి బస్సుకు రోజుకు రూ.350 చొప్పున కమీషన్ చెల్లిస్తారు.
సిబ్బంది, చిన్నారులకు ఉచిత వెసులుబాటు..
ప్రతి కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులో క్రింది వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు.
1) ఇద్దరు వంట మనుషులు (కూక్స్).
2) 10 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ఇద్దరు మణికంఠ (బాల) భక్తులు.
3) ఒక లగేజీ అటెండెంట్ (ప్రత్యేక సీటు కేటాయించకుండా ప్రయాణించే అవకాశం).
కేరళ పన్ను మినహాయింపు, కాంటాక్ట్ వివరాలు
ఈ ఏడాది తెలంగాణ రవాణా సంస్థకు చెంది (టీజీఎస్ఆర్‌టీసీ) కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు పన్ను (బోర్డర్ టాక్స్) నుంచి పూర్తి మినహాయింపు మంజూరు చేయడంతో భక్తులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది. స్వామివారి దర్శన వేళలకు సరిపోలేలా రవాణా ప్రణాళిక చేశారు. బస్సుల ముందస్తు బుకింగ్స్, ఇతర సమాచారం కోసం భక్తులు 040-66440000, 040-23450033 ఫోన్ నంబర్లలో ఆర్టీసీ అధికారులను సంప్రదించవచ్చు.