SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

TGSRTC Sabarimala: శబరిమల యాత్రికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్..గురుస్వాములకు ఉచిత ప్రయాణం, రోజుకు రూ.350 వేతనం!

TGSRTC Sabarimala Buses: కార్తీక మాసం శబరిమల అయ్యప్ప స్వామి మండల, మకరవిలక్కు మహోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భక్తులకు అద్భుతమైన అవకాశం కల్పించింది. శబరిమల క్షేత్ర దర్శనం కోసం ప్రత్యేక కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. యాత్రను మరింత సులభతరం చేస్తూ గురుస్వాములు, వారి సహాయక సిబ్బంది, చిన్నారులకు ఉచిత ప్రయాణ వెసులుబాట్లు, కమీషన్ సదుపాయాలను ప్రకటించింది. అంతేకాకుండా టికెట్‌పై మరింత తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది.

Written By Harish Darla
Published: Nov 05, 2026, 10:44 AM IST | Updated: Nov 05, 2026, 10:50 AM IST
Join

TGSRTC Sabarimala Buses: అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శబరిమల పూజా సమయాలకు అనుగుణంగా రెండు విడతల్లో ఈ బస్సులను నడపనున్నారు. మండల పూజ కాలం కోసం నవంబరు 16వ తేదీ నుంచి డిసెంబరు 27వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే మకరవిలక్కు, మకరజ్యోతి కోసం డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు రెండో విడత సర్వీసులు కొనసాగుతాయి.

గురుస్వాములకు ప్రత్యేకాకర్షణలు, కమీషన్..
బస్సుల బుకింగ్ నిర్వహించే గురుస్వాములను ప్రోత్సహించేలా టీజీఎస్ఆర్‌టీసీ పక్కా ప్రణాళిక రూపొందించింది. బస్సు బుక్ చేసిన గురుస్వామికి ఆ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఉచిత ప్రయాణంతో పాటు కమీషన్ ప్రోత్సాహకం కూడా ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ బస్సులను బుక్ చేసే గురుస్వామికి, ఒక బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు అదనంగా బుక్ చేసే ప్రతి బస్సుకు రోజుకు రూ.350 చొప్పున కమీషన్ చెల్లిస్తారు.

సిబ్బంది, చిన్నారులకు ఉచిత వెసులుబాటు..
ప్రతి కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులో క్రింది వారికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు.
1) ఇద్దరు వంట మనుషులు (కూక్స్).
2) 10 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న ఇద్దరు మణికంఠ (బాల) భక్తులు.
3) ఒక లగేజీ అటెండెంట్ (ప్రత్యేక సీటు కేటాయించకుండా ప్రయాణించే అవకాశం).

కేరళ పన్ను మినహాయింపు, కాంటాక్ట్ వివరాలు
ఈ ఏడాది తెలంగాణ రవాణా సంస్థకు చెంది (టీజీఎస్ఆర్‌టీసీ) కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు పన్ను (బోర్డర్ టాక్స్) నుంచి పూర్తి మినహాయింపు మంజూరు చేయడంతో భక్తులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది. స్వామివారి దర్శన వేళలకు సరిపోలేలా రవాణా ప్రణాళిక చేశారు. బస్సుల ముందస్తు బుకింగ్స్, ఇతర సమాచారం కోసం భక్తులు 040-66440000, 040-23450033 ఫోన్ నంబర్లలో ఆర్టీసీ అధికారులను సంప్రదించవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES