TSCPSEU Protest Nalgonda: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు కె. కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అధికారంలోకి వచ్చాక హామీలను మరవద్దు:
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని కిరణ్ కుమార్ గుర్తుచేశారు. ఆ హామీని నమ్మి రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వాగ్దానాలను విస్మరించడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాల తరహాలో అమలు చేయాలి:
ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని సుమారు 2.60 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపాలని విజ్ఞప్తి చేశారు. గతంలో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి చూపించాయని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ తక్షణమే OPSను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.



తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు:
నల్లగొండలో జరిగిన ఈ సత్యాగ్రహ దీక్షకు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తరలివచ్చి తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో TSCPSEU రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం, లక్ష్మయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి రోహిణి, అనిల్, సోమనాథ్, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షుడు ఓ. నవీన్ కుమార్, కోశాధికారి నందకుమార్‌లతో పాటు వినోద, శైలజ, శోభ, సుమతి తదితరులు పాల్గొని దీక్షను విజయవంతం చేశారు.
Also Read: