తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు.. ఈ నెల 27 వరకు ఓ మోస్తరు వర్షాలు..
Telangana Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు పలు ప్రాంతాల్లో చిరు జల్లు కురిసే అవకాశాలున్నాయి.
Telangana Rains: గత కొన్నేళ్లుగా ఎన్నడు లేనట్టు తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. మరోవైపు ఈ సారి దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి స్థానికంగా ఉండే చెరువుల్లో నీళ్లు ఎండిపోయిన సంఘటనలు చూశాము. మరోవైపు మొన్న తుపానుల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిస్తాయని అనుకున్నారు. కానీ అవి ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోనే కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. ఇక అక్వాన్ తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరుగుతాయనుకుంటే అది ఒడిషా వైపు వెళ్లిపోయింది. ఓ రకంగా తుపానుల కారణంగా తెలంగాణలో వర్షాలు కురిసి భూగర్భ జల మట్టాలు పెరుగుతాయనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి.
వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు..
మరోవైపు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలపై పెద్ద ప్రభావమే చూపుతుంది. ఈనెల 27 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.
ఈనెల 27 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు..
ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉదయాన్నే పొగమంచు దట్టంగా కమ్మేసే అవకాశం ఉంది. పొగమంచు కారణంగా రహదారులపై కనుచూపు మేర ఏమి కనబడటం లేదు. ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఈ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో వాహనదారులు లైట్ డిప్ వేసుకొని వెళ్లాలని సూచిస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజాము, ఉదయం వేళల్లో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నెలాఖరు నుంచి తెలంగాణలో విపరీతమైన చలి..
వర్షాల అనంతరం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని, నవంబర్ 29 నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాత్రి, తెల్లవారుజాము వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.