SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dandiya Event Tragedy: దాండియా ఉత్సవాల్లో కూలిన లైటింగ్.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు

Lighting System Collapse In Dandiya Event Two Persons Died At Nadargul: ఎంతో ఉత్సాహంగా దాండియా వేడుకలు జరుగుతుండగా.. అదే ఉత్సాహంతో యువతీ యువకులు ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా లైటింగ్‌ కమాన్‌ కుప్పకూలిపోయింది. భారీ లైటింగ్‌ కమాన్‌ కూలిపోవడంతో దాండియా ఆడుతున్న వారిపై పడింది. దీంతో పెద్ద ఎత్తున తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Written By Ravi Kumar Sargam
Published: Oct 17, 2026, 10:49 PM IST | Updated: Oct 17, 2026, 11:04 PM IST
Image Credit: MVSR Engineering College Tragedy
Join

MVSR Engineering College: దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలతోపాటు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు, వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలు ఒక్కసారిగా తీవ్ర విషాదంగా మారాయి. ఓ కళాశాలలో ఏర్పాటుచేసిన బతుకమ్మ, దాండియా వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చోటుచేసుకుంది. ఈ తీవ్ర విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లో ఎంవీఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్ కాలేజీలో బతుకమ్మ ఉత్సవాలు శనివారం సాయంత్రం నిర్వహించారు. బతుకమ్మ సంబరాలు, దాండియా ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఉత్సవాల కోసం కళాశాలలో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఉత్సవాలు ప్రారంభమైన కొన్ని నిమిషాల తర్వాత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేడుకల కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ లైటింగ్, సౌండ్ సిస్టం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరారు.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కళాశాల యాజమాన్యం మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైటింగ్ ఏర్పాట్లలో నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ జరుగుతోంది. కళాశాల యాజమాన్యం / ఆసుపత్రి వర్గాలు మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఒకరి ఆచూకి వెల్లడి..
మృతుల్లో ప్రథమ సంవత్సరం చదువుతున్న వనపర్తికి చెందిన ఓ విద్యార్థిని ఉన్నారు. మరో మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ముఖ్యమంత్రి సంతాపం
నాదర్‌గుల్‌ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రమాదం జరిగి విద్యార్థులు మృతి చెందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం.. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కేటీఆర్‌ తీవ్ర ఆవేదన
ఎంవీఎస్ఆర్ కళాశాలలో జరిగిన ప్రమాదంలో విద్యార్థుల మృతి చెందడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని కోరారు. ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

తీవ్ర సంతాపం
ఈ సంఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రమాద ఘటనలో విద్యార్థి  ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. విద్యార్థి కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందని, వారి ఆవేదనను మాటల్లో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి, వారు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  ప్రతి కార్యక్రమంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని  మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఘటనకు దారి తీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులెవరైనా ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES