Greater Noida couple and 3 children died after eating noodles: ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో షాకింగ్ ఘటన జరిగింది. నాగ్లా శ్రీగోపాల్ గ్రామంలో ఇటీవల నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవుల్లా మారారు. రాత్రి నూడుల్స్ తిన్నకుటుంబం ఉదయం వరకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చనిపోయిన వారిలో.. ఒకే కుటుంబానికి చెందిన మహేష్ (37), అతని భార్య లలిత (35), వారి కుమారులు లడ్డు (11), సాక్షాత్ (3), కుమార్తె మిష్టి (7)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మరణాలు కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
డెడ్ బాడీలను పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే.. ఒకేసారి ఐదుగురు చనిపోవడం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దీనిపై ఆహర భద్రత సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు. అయితే స్థానికుల ప్రకారం.. మహేష్ తల్లి నూడుల్స్ వండిందని ఇరుగుపొరుగు వారు మాట్లాడుకుంటున్నారు. కొన్ని రోజులుగా తల్లికి,కొడుకుకు మధ్య ఆస్తితగాదాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇప్పటికే ఆస్తిని తన కూతురు మీద బదిలీ చేసిందని,తరచుగా ఇదే విషయంలో తల్లి, కొడుకు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని చెప్పారు. అంతే కాకుండా ఫోరెన్సిక్ నిపుణులు సైతం నూడుల్స్ లో ప్యాకెట్ లను తనిఖీలు చేశామని, దానిలో ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ కెమికల్ లు లేవని గుర్తించినట్లు చెప్పారు.
మొత్తంగా ఈ ఐదుగురు మరణం వెనుక ఖచ్చితంగా విషప్రయోగం జరిగి ఉంటుందని అనుమానంవ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు బైటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.