Jagtial Police Martyrs Day: ప్రజాక్షేమం కోసం.. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మర్చిపోలేనివని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ తో పాటు ఎస్పీ పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు..
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. సాధారణ ప్రజలు ప్రశాంతంగా.. భయం లేకుండా జీవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం రాత్రి పగళ్ళు శ్రమిస్తున్న పోలీసుల అంకిత భావమేనని ఆయన అన్నారు. కంటికి రెప్పలా కాపాడే పోలీసుల నిస్వార్ధ సేవలు డబ్బులతో వెల కట్టలేనివని ఆయన కొనియాడారు. సమాజం కోసం సర్వోన్నతమైన త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వారి సంక్షేమానికి సంబంధించిన అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తామని భరోసానందించారు..
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. విధినిర్వహణలో అమరులైన వీరుల త్యాగాలు ఎప్పటికీ గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతగానో ఉందని.. వారి కర్తవ్యం ప్రస్తుత పోలీసు సిబ్బందికి మార్గదర్శకమని.. ఆ స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన సహచరుల జ్ఞాపకార్థం ప్రతి క్షణం విధులు నిర్వహించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళులని ఆయన పేర్కొన్నారు..
అనంతరం జిల్లా అధికారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడి... వారికి సంబంధించిన యోగక్షేమాలను.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక జ్ఞాపికలను అందజేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ చైతన్ నితిన్ తో పాటు ఐపీఎస్లు, డీఎస్పీలు పాల్గొన్నారు.