Karimnagar: 'చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించాలా? వద్దా? విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించాలా? వద్దా? రెండు, మూడేసి ఓట్లున్న వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించాలా? వద్దా? 18 ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించాలా? వద్దా? సర్ పేరుతో ఓటర్ జాబితాను ప్రక్షాళన చేస్తుంటే కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి?' అని కాంగ్రెస్ నాయకులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 23న నితిన్ నబిన్ పర్యటనకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్‌లోని పద్మశాలి సంఘం భవనంపై నూతనంగా నిర్మించిన గదులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం జరిగిన పద్మశాలి సంఘం నాయకుల సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలకు పూర్తి స్థాయిలో అద్బుతమైన రీతిలో శాశ్వతమైన భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా గుడి, బడి ఆసుపత్రులను నిర్మించడంతోపాటు కార్పొరేట్ స్థాయిలో అర్హులైన పేద, మధ్య తరగతి ప్రజలందరికీ విద్య, వైద్య సేవలను అందిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. అధికారంలో లేకపోయినా ఎంపీ లాడ్స్ నిధులతో పద్మశాలి సంఘం భవనానికి సాయం అందించానని.. దీంతోపాటు అన్ని కుల సంఘాలకు సాయం చేసినట్లు చెప్పుకొచ్చారు. వీలైనంత కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతోపాటు గుడి, బడి, ఆసుపత్రి సేవలకు తాను అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కుల సంఘాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్య సేవలు అందిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనలో తెలంగాణ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలి మాటలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. సర్ పైన లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ‘చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించాలా? వద్దా? విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించాలా? వద్దా? రెండు, మూడేసి ఓట్లున్న వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలా? వద్దా? 18 ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించాలా? వద్దా? సర్ పేరుతో ఓటర్ జాబితాను ప్రక్షాళన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమిటి?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.
‘సర్’ పై వాస్తవాలను వివరించేందుకు ఈనెల 23వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్‌కు వస్తున్నారని.. ప్రతి ఒక్కరూ మహా పాదయాత్రకు హాజరై విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పద్మశాలీ కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.