Crime News: ఒకే గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. రెండేళ్ల వారి ప్రేమ పెళ్లిగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆ ప్రేమికులు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. అతడితో పెళ్లికి తన కుటుంబసభ్యులను యువతి ఒప్పించింది. అయితే యువకుడి కుటుంబసభ్యులు అంగీకారం తెలపకపోవడంతో వారి ప్రేమ పెళ్లి వైపు అడుగులు తీయకపోవడంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. దీనికితోడు గొడవలు జరుగుతున్నప్పటి నుంచి తన ప్రియుడు దూరం పెడుతుండడంతో తట్టుకోలేకపోయింది. పలుమార్లు లైంగిక బంధం ఏర్పడడంతో గర్భం దాల్చగా ఆ యువకుడు అబార్షన్ చేయించాడు. ఇంత చేసిన ఆ యువకుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆ యువతి ఇక తనకు చావే దిక్కు అని తన ప్రాణం తీసుకుంది. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన మునిగె కుమారస్వామి, సుకన్య దంపతులు వ్యవసాయం, కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె సుస్మిత (25) డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు శిక్షణ పొందుతోంది. మహబూబాబాద్‌లో పోలీసులు నిర్వహిస్తున్న ఎస్సై ఉద్యోగ శిక్షణ తరగతులకు హాజరవుతుండేది. అయితే గ్రామానికి చెందిన అనిల్, ఆమె ప్రేమలో పడ్డారు. రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయంలో వేరే కులం కావడంతో తన ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ప్రియుడు అనిల్ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఒకసారి గర్భం దాలిస్తే గర్భస్రావం చేయించాడు. పెళ్లి విషయంలో అనిల్, సుస్మిత తరచూ మాట్లాడుకుంటున్న సమయంలో కొన్నాళ్లుగా ప్రియుడు దూరం పెడుతుండడాన్ని తట్టుకోలేకపోయింది. పెళ్లిపై నిలదీయగా పట్టించుకోకపోవడంతో ఆ యువతి గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది.
ప్రేమ విఫలమవడంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మరణానికి ముందు యువతి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే కూతురు ఎస్సై ఉద్యోగం సాధించి ఉన్నత స్థితికి వెళ్తుందని భావించగా.. అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ చావుకు ఆమె ప్రియుడు అనిల్ కారణమని.. అతడిని అరెస్ట్ చేసి కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు, బంధుమిత్రులు డిమాండ్ చేస్తున్నారు.
సూసైడ్ నోట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు
ఆత్మహత్య చేసుకునే ముందు యువతి సుస్మిత సూసైడ్ నోట్ రాసుకున్నారు. అందులో అనిల్‌తో తన ప్రేమాయణం.. వారి కుటుంబసభ్యుల మాటలు అన్నీంటిని వివరించారు. అనిల్‌ను వదిలిపెట్టరాదని.. సైలెంట్‌గా ఉన్న తన జీవితంలోకి వచ్చాడని.. ప్రేమ పెళ్లి, బయటకు పోయి బతుకుదాం అని చెప్పి మోసం చేశాడని సుస్మిత వాపోయారు. తన క్యారెక్టర్‌ను కించపరుస్తూ మాట్లాడడమే కాకుండా తన కులాన్ని.. కుటుంబాన్ని అనిల్ దూషించాడని సుస్మిత సూసైడ్ నోట్‌లో వివరించారు. ఆ సూసైడ్ నోట్ చదివిన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.