సన్నగా ఉన్నామని సంబరపడకండి.. భారతీయులను కబళిస్తున్న లీన్ డయాబెటిస్.. అసలు ప్రమాదం ఎక్కడంటే?
Lean Diabetes:సాధారణంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి మాత్రమే మధుమేహం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, సన్నగా, నాజూగ్గా ఉన్నంత మాత్రాన టైప్-2 డయాబెటిస్ బారిన పడకుండా తప్పించుకోలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Lean Diabetes: సాధారణంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి మాత్రమే మధుమేహం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, సన్నగా, నాజూగ్గా ఉన్నంత మాత్రాన టైప్-2 డయాబెటిస్ బారిన పడకుండా తప్పించుకోలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చూడటానికి శరీర బరువు తక్కువగా కనిపించినప్పటికీ, పొట్ట చుట్టూ.. శరీరంలోని అంతర్గత అవయవాల వద్ద కొవ్వు (విసెరల్ ఫ్యాట్) పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'లీన్ డయాబెటిస్' (Lean Diabetes) అని పిలుస్తారు. సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కలిగి ఉండి, ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం మెండుగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో అంతర్గతంగా పేరుకుపోయే కొవ్వు కారణంగా ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరిగి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయని, అదే చివరకు లీన్ డయాబెటిస్‌కు దారితీస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. కాబట్టి కేవలం శరీర బరువును మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ విషయంపై ఎండోక్రినాలజిస్ట్ మాట్లాడుతూ.. డయాబెటిస్‌ను నిర్ధారించడానికి BMI ఒక్కటే ప్రామాణికం కాదని అన్నారు. నడుము చుట్టుకొలత చాలా ముఖ్యం. అది మహిళల్లో 80 సెం.మీ కంటే, పురుషుల్లో 90 సెం.మీ కంటే ఎక్కువగా ఉంటే, దానిని ఒక ప్రమాద కారకంగా పరిగణించాలి. ఇతర దేశాలతో పోలిస్తే, భారతీయులు తక్కువ బరువు ఉన్నప్పటికీ డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన వివరించారు.
భారతీయులలో అధిక శరీర కొవ్వు శాతం, తక్కువ కండరాల బలం కారణంగా ఈ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర, నిశ్చల జీవనశైలి, ఫ్యాటీ లివర్, రక్తంలో అధిక ట్రైగ్లిజరైడ్స్ కూడా ప్రమాద కారకాలేనని ఆయన తెలిపారు.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త:
మీకు నిరంతర అలసట, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మీ డాక్టర్ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, HbA1c, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) వంటి పరీక్షలను సూచించే అవకాశం ఉంటుంది. కేవలం మీ బరువుపైనే కాకుండా, జీవక్రియ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
Also Read: