AP CM Convoy: భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు మరింత భద్రత కల్పించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు దేశంలోనే అత్యంత భద్రత కల్పిస్తుండగా.. ఈ క్రమంలోనే ఆయన కాన్వాయ్‌లో మరికొన్ని వాహనాలు చేరనున్నాయి. కొత్త వాహనాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈం సదర్భంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ కాన్వాయ్ కోసం 6 కొత్త ఆర్బానియా వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1.78 కోట్లతో ఆరు ఆర్బానియా వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా చంద్రబాబు వాహనంలో చేరే ఒక్కో వాహనం సగటు ధర రూ.29.67 లక్షలు ఉంటుంది. ఫోర్స్ ఆర్బానియా 4400 డబ్ల్యూబీ మోడల్ వాహనాల కొనుగోలుకు అనుమతి ఇవ్వడంతో ఆరు వాహనాలకు కలిపి రూ.1,78,05,000 నిధులు అవసరమవుతాయి. ఈ మేరకు అదనపు నిధుల కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జెమ్ పోర్టల్ ద్వారా ఈ వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో వినియోగిస్తున్న టయోటా వాహనాల స్థానంలో కొత్త ఆర్బానియా వాహనాలు చేరనున్నాయి. ఈ వాహనాల కొనుగోలుపై గతంలో నిషేధం ఉండగా.. తాజాగా వాహనాల కొనుగోలుపై ఉత్తర్వులు సడలించి.. వాహనాల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు. హోంశాఖ ప్రతిపాదనను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నాడు పొదుపు.. నేడు కొనుగోలు
కొన్ని నెలల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు చర్యలు సూచించారు. వాహనాలు తగ్గించుకుని.. ఇంధనం పొదుపు చేయాలని పిలుపునివ్వగా.. అందులో భాగంగా సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాలను భారీగా తగ్గించారు. మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించి తన కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించగా.. ఇప్పుడు వాహనాలు కొత్తవి రావడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కాన్వాయ్‌కు సంబంధించి రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది. నాడు పొదుపు చర్యలు పాటించిన చంద్రబాబు.. ఇప్పుడు దుబారా ఖర్చులు చేయడాన్ని ఏపీలోని నాయకులు తప్పుబట్టే అవకాశం ఉంది.