మొన్న అర్నబ్.. నిన్న మురసు .. ఏపీని నిండా ముంచి తుపానులు..
AP continues Toofans: మొన్న అర్నబ్ తుఫాన్… నిన్న మురసు సముద్ర తీర ప్రాంతాలను విధ్వంసం చేశాయి. అక్టోబరు ఆఖరి వారంలో అర్నబ్ దుమ్ముదులిపితే… నవంబరు తొలివారంలో మురసు ముంచేసింది. మొత్తంగా రెండు తుపానులు ఏపీని తీవ్రంగా దెబ్బతీసాయి. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లిందంటే..
Toofan Effects on Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌ను కొన్ని రోజులు వ్యవధిలో అర్నబ్ ఉప్పాడ సహా పలు తీర ప్రాంతాలు కోతకు గురయ్యేలా చేసింది. అటు మురసు తుపాను కూడా ఏపీని కుదిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అటు అర్నబ్.. ఇటు మురసు తుఫాను దాడి చేయడంతో కోస్తాంధ్ర తీవ్రంగా దెబ్బతింది.
ఒంగోలులో తీరం దాటిన తుపాను..
ఒంగోలు సమీపంలో ఈ తుఫాను తీరం దాటింది. ప్రస్తుతం ఇది బలహీనపడి వాయుగుండంగా మారి తెలంగాణ, కోస్తాంధ్ర సరిహద్దుల్లో కేంద్రీకృతమైంది. తుఫాన్ తీవ్రతను ముందుగానే పసిగట్టిన అధికార యంత్రాంగం ప్రజానీకాన్ని అప్రమత్తం చేసింది. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టాన్ని నివారించారు. లోతట్టు ప్రాంతాల నుండి సుమారు 12,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి 171 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు..
బలమైన గాలుల ధాటికి వేల సంఖ్యలో చెట్లు నేలకూలాయి, దాదాపు 2,750కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. కాకినాడను మురసు తుపాను ముంచెత్తింది. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. మెయిన్‌రోడ్డు, సినిమా హాల్ రోడ్డు, దేవాలయం వీధిలోకి మోకాళ్ల లోతు వరకు వాన నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా జలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో రహదారులు, వీధుల్లో వరద ఏరులై పారుతోంది. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పిల్లరాయ వీధిలో నడుములోతు వరకు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం విద్యుత్ పునరుద్దరణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ఈశాన్య తెలంగాణలో కుండపోత వర్షాలు..
మురసు తుఫాను ప్రభావంతో తూర్పు, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వాతావరణ వ్యవస్థ ఖమ్మంకు దక్షిణంగా, నల్గొండకు తూర్పుగా కేంద్రీకృతమై ఉత్తర దిశగా కదిలింది. దీని ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. మొత్తంగా తుపాను ముంచినా.. తెలంగాణలో తుపాను ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పెరగడం గమనార్హం.