CM Chandrababu naidu press meet on Arnab cyclone impact: పశ్చిమ, మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ గంటకు 20 కిలోమీటర్ల వేగంగా తీరంవైపుకు మహాతుపాననుగా దూసుకొని వస్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మరోసారి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన అధికారులతో పాటు ప్రజలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రజలు రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని సూచించారు. ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నిరంతరం తుఫాన్ సన్నద్ధతపై సమీక్ష చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలుజరక్కుండా జాగ్రత్తలు తీసుకొవాలన్నారు. అర్నబ్ తుపాను రెడ్ కేటగిరీలో ఉందని, అయినా ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదన్నారు.
శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకూ తుఫాన్ ప్రభావం ఉంటుందని వివరించారు. పశ్చిమగోదావరి, కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకూ ఎక్కువ వర్షాలు, గాలుల తీవ్రత ఉంటుందని సీఎం వెల్లడించారు. కాకినాడ సమీపంలోని యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని ఆ సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు పడుతాయని, ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవాళ రాత్రికి, రేపు కూడా వర్షపాతం తీరప్రాంతాల్లో నమోదు అవుతుందన్నారు. కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళంలో 30 సెంటీ మీటర్ల, పశ్చిమ గోదావరిలో 28, విశాఖ 23 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చాలా చోట్ల 10 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు అవుతుందన్నారు.
తీర ప్రాంత జిల్లాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరారు. సముద్ర తీరగ్రామాలు, లంకలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తుఫాన్ షెల్టర్లకు వెళ్లాలని పలు సూచనలు చేశారు.
తుఫాన్ ప్రభావంతో ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 290 షెల్టర్లను ఏర్పాటు చేశామని, 84,396 మందిని షెల్టర్లకు తరలించామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పని చేస్తున్నాయని, ప్రతి గంటకూ తుఫాన్ హెచ్చరికల బులెటిన్ జారీ చేస్తున్నామన్నారు. తుఫాన్ తీవ్రత ఉండే ప్రాంతాలకే అప్రమత్తతా హెచ్చరికలు జారీ చేశామన్నారు.