Telangana Government officially Declares Drought affected Mandals: తెలంగాణలో ఎన్ నినో ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. ఈక్రమంలో ఇప్పటికే వర్షాలు లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో నీళ్లులేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇక తాగడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో నీటి కటకట ఏర్పడింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఎల్ నినో వేల కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో 365 కరవు ప్రభావిత మండలాలుగా గుర్తించింది. ఇందులో 111 మండలాల్లో తీవ్రమైన, 254 మోస్తరు కరువు ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరవు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది.
కరువు ప్రభావిత మండలాలపై జీవో నంబర్ 3 విడుదల చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది.
2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కరువు మండలాల ప్రకటన చేశారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం.. బలహీనపడిన బంగాళాఖాతం అల్పపీడన వ్యవస్థలతో వర్షాభావ పరిస్థితులు ఏర్పాడ్డాయని అధికారుల పేర్కొన్నారు. సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు కాగా.. ప్రస్తుతం నమోదైంది 615.5 మిల్లీమీటర్లేనంటూ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. 33 జిల్లాల్లో 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, ఖరీఫ్ సాగు విస్తీర్ణం 139.28 లక్షల ఎకరాల నుంచి 126.06 లక్షల ఎకరాలకు తగ్గుదల జరిగిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
వరి సాగు విస్తీర్ణంలో 18 శాతం తగ్గిందని, గతంలో 69.19 లక్షల ఎకరాల్లో వరి సాగు.. ప్రస్తుతం 57 లక్షల ఎకరాలకే పరిమితం అయ్యిందన్నారు. ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టుల్లో 585 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 179.63 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.
తాగునీటి సరఫరా, పశుగ్రాసం, అవసరమైన చోట పశువుల శిబిరాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పన చర్యలు చేపట్టాలని సూచించారు. కరువు ప్రభావిత రైతుల వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులు కోరేందుకు ఏడు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. జీవో ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల పాటు కరువు ప్రకటన అమల్లో ఉండనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది.