SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chintalapudi Project: 'చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు'పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu Orders To Restart Chintalapudi Project Works: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నవంబర్‌ నుంచి చింతలపూడి పనులు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. మరికొన్ని నీటి ప్రాజెక్టులపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Oct 23, 2026, 11:00 PM IST | Updated: Oct 23, 2026, 11:09 PM IST
Image Credit: Chandrababu Review Meeting
Join

Chandrababu Review Meeting: చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పర్యావరణ అనుమతులు రావడంతో త్వరితగతిన పనులు మొదలుపెట్టాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో జలవనరుల సమర్థ నిర్వహణ, నదుల అనుసంధానమే లక్ష్యంగా జల వనరుల శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు, ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. జలవనరుల సమర్థ నిర్వహణ, నదుల అనుసంధానమే లక్ష్యంగా జల వనరుల శాఖ పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో గుర్తించిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, 2028 డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.

కాలువల వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. కాలువలపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. జల హారతి కార్పొరేషన్ ద్వారా జల వనరుల శాఖకు ఆదాయాన్ని సమకూర్చేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టుపై స్పందిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక అంశాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అత్యుత్తమ నిపుణులను నియమించి ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 90.2 శాతం సివిల్‌ పనులు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌లో గ్యాప్‌-1, గ్యాప్‌-2 పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలువల ద్వారా గరిష్ఠ స్థాయిలో నీటిని తరలించేలా వాటి సామర్థ్యాన్ని పెంచాలని.. ఐకానిక్‌ బ్రిడ్జిని పూర్తి చేసి రాకపోకలతోపాటు పర్యాటక అభివృద్ధికి అవకాశాలు కల్పించాలని సూచించారు.

గోదావరి-పెన్నా అనుసంధానంపై కార్యాచరణ ప్రారంభించాలని.. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తరలించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజికి ఎగువన, దిగువన వైకుంఠపురం, చోడవరం వద్ద ఆనకట్టల నిర్మాణం ద్వారా 14 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలన్నీ క్రియాశీలంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు అంతర్గత జల రవాణాకు అవసరమైన నావిగేషన్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు.

జలధార-జలహారతి రెండో దశ పనులను మార్చి 31వ తేదీ వరకు కొనసాగిస్తూ.. 150 రోజుల కార్యక్రమంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్‌ జీతో అనుసంధానం చేసి పనులు చేపట్టాలని.. 2027 ఏప్రిల్‌ 1 నుంచి మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పారు. భూగర్భ జలమట్టాలను మూడు మీటర్లకు పైగా పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలని, చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలను పెంచాలని తెలిపారు. కాలువలపై సౌర విద్యుత్‌ ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.

తుఫానుపై సమీక్ష
బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ రిజర్వాయర్లు, చెరువులను నింపాలని సూచించారు. వరద నిర్వహణ, నీటి నిర్వహణ, విపత్తుల నిర్వహణపై సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES