Deputy cm Pawan kalyan on murasu cyclone impact: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వరుస తుపాన్ లతో అల్లకల్లోలంగా మారింది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తుపాన్ ల ప్రభావంపై అధికారులతో మాట్లాడుతూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే అర్నబ్ తుపాన్ తో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రభావం తగ్గక ముందే మురసు తుపాన్ తో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మురసు తుపాన్ మరికొన్ని గంటల్లో తీరం దాటనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
గుంటూరు వంటి ప్రాంతంలో గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇక భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు సిబ్బందికి సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకొవాలన్నారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలు, కాలువ గట్లను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులకు సమీపంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.
గతంలో అర్నబ్ తుపాను సమయంలో అనుసరించిన విధంగానే.. ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని తరలించి, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర పనులకు వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందని, పెద్ద ఎత్తున వర్షపు నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థకు అడ్డంకులు ఏర్పడకుండా చూడాలని, వర్షంనీరు తాగే నీళ్లలో కల్వకుండా చర్యలు తీసుకొవాలన్నారు. నీటిని తొలగించిన ప్రాంతాల్లో దుర్వాసన, దోమల వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తెల్చి చెప్పారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్, క్లోరినేషన్, అవసరమైన చోట సూపర్ క్లోరినేషన్ చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని దిశా నిర్దేశం చేశారు.
అదే విధంగా.. వర్షపు నీటి ప్రవాహాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణం పునరుద్ధరించి, గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని చెప్పుకొచ్చారు. వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పంట నష్టం, ఆస్తి నష్టం సంభవించిన ప్రాంతాల్లో తక్షణమే అంచనాలు రూపొందించాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.