Maoists: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ సందర్భంగా సాగుతున్న పోలింగ్ సరళిపై వైఎస్సార్‌సీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు ప్రత్యక్షంగా సహకరిస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. దీనికి పులివెందులలో చోటుచేసుకుంటున్న ఉదంతాలే స్పష్టమైన ఆధారమన్నారు.
పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మొత్తం 80 పోలింగ్ కేంద్రాల్లో 70 బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బలవంతంగా ఖాళీ చేయించారని జగన్ ఆరోపించారు. ఉదయం 4 గంటల నుంచే అధికార టీడీపీ నేతలు, శ్రేణులు పోలింగ్ బూత్‌లను తమ గుప్పెట్లోకి తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఓటర్లు హక్కును వినియోగించుకునేందుకు వస్తుంటే వారి స్లిప్పులు లాక్కుని, పోలీసుల సాయంతో వెనక్కి పంపించేస్తున్నారని ఆక్షేపించారు.
అధికార పక్షానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని.. అసలు ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని నిలదీశారు. కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉంటూ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కనీసం పారదర్శకత నిలిచేలా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా అమర్చకపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలి, బాధితులకు న్యాయం దక్కనప్పుడే ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగుల్తాయన్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిన వాతావరణంలోనే మావోయిస్టుల వంటి పరిణామాలు, కాక్రోచ్‌లు పుట్టుకొస్తాయన్నారు వైఎస్ జగన్. పులివెందులతో సహా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న అక్రమ ఎన్నికల విధానాన్ని తీవ్రంగా నిరసించిన జగన్.. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: