Supreme court key order to ap sec to extend nomination dead line: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి కూటమి వర్సెస్ వైసీపీ మధ్య వార్ నడుస్తొంది. నామినేషన్ దాఖలు చేసే క్రమంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య రాళ్ల దాడులు, నామనేషన్ లు వేస్తున్న అభ్యర్థులపై దాడులు జరిగాయి. పోలీసులు పలు చోట్ల ఈ ఘటనలపై గాల్లో కాల్పులు జరిపారు.
మొత్తంగా ఎన్నికలకు ముందే నామినేషన్ ల సమయంలో ఇలాంటి ఘటనలు జరగడంతో సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే వైసీపీ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని రాష్ట్రపతి పాలన విధించాలని కూడా కోరారు. ఎన్నికల సంఘం ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తుందని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఏపీలో నామినేషన్ల వివాదంపై సుప్రీంకోర్టులో వైసీపీ ఫిర్యాదులు చేస్తు పిటిషన్ లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఏపీ ఎన్నికల సంఘంకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో నామినేషన్లపై ఫిర్యాదులు అందిన 19 చోట్ల నామినేషన్ ల గడువును పెంచడంపై రేపటి వరకు నిర్ణయం తీసుకొవాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘంను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 25 వరకు ప్రకటించవద్దని తెల్చి చెప్పింది.
ఎక్కడైతే గడువు పొడిగింపు చేస్తారో.. అక్కడ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆ నిర్ణయం ప్రకటించిన తేదీ నుండి కనీసం 48 గంటల సమయం ఉండాలని సూచించింది.
అంతే కాకుండా.. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు పోలీసు బందోబస్తు, సీసీటీవీ కవరేజ్ ఉండేలా చూడాలని ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను ఆదేశించింది. దీనిపై ఎస్ ఈసీ ఒక నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో తదుపరి విచారణను అక్టోబర్ 27కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.