Big Rain Alert for Two Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా అక్టోబర్ ప్రాంతంలో అల్ప పీడనం తుపానుగా మారి ఈ సీజన్లో వర్షాలు పడుతుంటాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనాలే తెలుగు రాష్ట్రాలకు దిక్కు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడే అల్ప పీడనాల వల్ల ఎక్కువగా కేరళ, కర్ణాటక,మహాష్ట్ర,. గుజరాత్లలో భారీ వర్షాలు పడతాయి. ఈ సారి ఋతుపవనాల సీజన్ ముగియడంతో ఇక వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ చెప్పింది. కానీ వచ్చే వారం ఒకేసారి తూర్పున బంగాళాఖాతంతో పాటు పడమర ఉన్న అరేబియా సముద్రంలో అల్ప పీడనాల ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
అల్ప పీడనం తుపానుగా మారే అవకాశం..
వీటిలో ఒకటి తుఫానుగా మారే ఛాన్సుందంటోంది. వచ్చే వారంలో దీనిపై స్పష్టత రావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా ఇవాళ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం , కాకినాడ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణ వర్షాలు..
ఎండల కారణంగా ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలన్న వాతావరణశాఖ ..
ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటోంది. వర్షంతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.