SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రాజా నగరం బుచ్చంపేట ఎంపీటీసీ సీటు వెనక అసలు లెక్కెంటీ.. జక్కంపూడి Vs కూటమి..!

MPTC Seat strategy: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తూర్పు గోదావరి జిల్లా రాజా నగరం నియోజకవర్గం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కోరుకొండ మండలం బుచ్చంపేట ఎంపీటీసీ స్థానం కోసం చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు అనేక రాజకీయపరమైన ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక సంస్థల్లో ఏకపక్షంగా పాగా వేయవచ్చని భావించిన అధికార కూటమికి క్షేత్రస్థాయిలో ఊహించని రీతిలో గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 11:36 AM IST | Updated: Oct 25, 2026, 11:39 AM IST
Image Credit: jakkampudi vs Kutami (File/Source)
Join

Jakkampudi vs Kutami Sarkar: ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష వైసీపీకి చెందిన నేతలు నామినేషన్లు వేయకుండా కూటమి అభ్యర్ధులు అడ్డుకున్న సన్నివేశాలు చూస్తున్నాము. మరోవైపు నామినేషన్ వేసిన అభ్యర్ధుల వాళ్ల పత్రాలను లాక్కొని చించేయడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రీసెంట్‌గా బుచ్చంపేటలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేశారంటూ ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి.  అసలు ఈ వ్యవహారం  వెనుక అసలు కథ వేరే ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు ఒక ఎంపీటీసీ అభ్యర్థి విషయంలోకి అధికార కూటమి ఎమ్మెల్యే, సీనియర్ నేతలు నేరుగా ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.  క్షేత్రస్థాయిలో ఏకగ్రీవాల పేరిట ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి? తెరవెనుక జరిగిన పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తే పలు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

ప్రలోభాలతో ఏకగ్రీవం.. 
ఈ వివాదం మూలాల్లోకి వెళితే.. బుచ్చంపేట ఎంపీటీసీ స్థానాన్ని పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకోవాలన్న అధికార పక్షం భావించింది. గ్రామాభివృద్ధి  కోసమంటూ ఒక భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకునేలా చేస్తున్నారనే ప్రచారం తీవ్ర దుమారం రేపుతుంది. గతంలో రాష్ట్ర రాజకీయాల్లో ఓటుకు నోటు తరహాలో సాగిన కొనుగోళ్ల సంస్కృతిని గుర్తుచేసేలా ఇది ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.  తాజాగా ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సీట్లను ముందుగానే డబ్బు, అధికారం ఇతరత్రా ప్రలోభాలతో ఏకగ్రీవాలు చేసుకునే కొత్త సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెరలేపుతున్నారా అన్న చర్చ ఏపీలో మొదలైంది.

ఏకగ్రీవాలకు కానీయద్దు.. జగన్.. 

ప్రజా తీర్పు ద్వారా కాకుండా, కేవలం ఆర్థిక బలం లేదా బెదిరింపులతో సీట్లను ఏకగ్రీవం చేసుకోవాలని చూడటం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు లాంటిదనే ప్రశ్న సామాన్య ప్రజల్లో తలెత్తుతోందనని వైసీపీ చెబుతుంది. అయితే కూటమి నేతలు మాత్రం గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇలాగే ప్రవర్తించిందన్న  విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వాళ్లు చేసిందే మేము చేస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అనివార్యం. దాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. అది ఏ ప్రభుత్వం చేసినా తప్పు తప్పే అని చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

జక్కంపూడి రాజా మొదటి నుంచీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు నమ్మికబంటు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా కూడా ఏకగ్రీవాలకు ఒప్పుకోవద్దని.. , ప్రతి స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వాలని జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అధికారం, డబ్బు ఇతరత్రా కారణాలు చూపించి పోటీ నుంచి వైసీపీ అభ్యర్ధులు విరమించుకునేలా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

క్షేత్రస్థాయి బలాన్ని పరిశీలిస్తే రాజానగరం నియోజకవర్గంలో జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ ఈజీగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  జెడ్పీటీసీ స్థానాన్ని గెలిచే సత్తా ఉన్న ప్రాంతంలో, కిందిస్థాయి ఎంపీటీసీ సీటును కూటమికి ఏకగ్రీవంగా వదిలేయడం అంటే పార్టీ ఎలా ఒప్పుకుంటుంది? జగన్ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే జక్కంపూడి రాజా లాంటి నాయకుడు చూస్తూ ఎలా ఊరుకుంటారు? అందుకే తన పార్టీ అభ్యర్థి వెనక్కి తగ్గుతున్నారని తెలిసిన వెంటనే రంగంలోకి దిగి నామినేషన్ వేయించే ప్రయత్నం చేశారు.

జక్కంపూడి చొరవ వల్లే ఎన్నికలు.. 
సాధారణంగా అధికారం మారిన తర్వాత ప్రతిపక్ష నేతలు క్షేత్రస్థాయికి వెళ్లేందుకు భయపడుతుంటారు. కానీ జక్కంపూడి రాజా స్వయంగా రంగంలోకి దిగి గట్టిగా నిలబడటం వల్లే అక్కడ ఎన్నికలు ఖరారయ్యాయి. లేకపోతే ఈ పాటికి ఏకగ్రీవమంటూ అంతా సైలెంట్‌గా ముగిసిపోయేదన్నది స్థానిక కేడర్ భావన. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమికి అంత తిరుగులేని బలం ఉందని భావిస్తే, ఒక చిన్న పంచాయతీ పరిధిలోని ఎంపీటీసీ అభ్యర్థి కోసం జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి స్వయంగా రంగంలోకి దిగి పరామర్శించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.  ప్రతిపక్షం తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థిని దగ్గరుండి పరామర్శించడం వెనుక ఉద్దేశం కేవలం మానవతా దృక్పథమేనా, లేక  తెరవెనుక కుదిరిన ఒప్పందం చేజారిపోతోందన్న ఆందోళనా అనేది తెలియాల్సి ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట.  నామినేషన్ పత్రాలను లాక్కునే ప్రయత్నాలు జరిగినా, ప్రలోభాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలబడాలని కేడర్ భావించడం వల్లే బుచ్చంపేటలో ఈ స్థాయి ప్రతిఘటన చోటుచేసుకుందనే వైసీసీ నేతలు చెబుతున్న మాట. మొత్తంగా చూస్తే, అధికార బలంతో ఏకగ్రీవాలు సాధించాలనే వ్యూహాలకు, అధినేత మాటకు కట్టుబడి క్షేత్రస్థాయిలో నిలబడాలనే జక్కంపూడి రాజా లాంటి నాయకుల పోరాటానికి మధ్య జరిగిన ప్రత్యక్ష ఘర్షణే ఈ బుచ్చంపేట వివాదానికి కేంద్ర బిందువు అని చెప్పాలి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES