AP CM Chandrababu Rs 500 Denomination: భారతదేశంలో కరెన్సీ నోట్ల చలామణి, ఎన్నికల్లో నగదు వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోట్లను రద్దు చేసి, మార్కెట్‌లో కేవలం రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే భారీ ఖర్చును తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గితే రాజకీయ నాయకుల్లో ప్రజాసేవ పట్ల నిబద్ధత పెరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల కోసం భారీగా డబ్బు ఖర్చు చేసిన నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకోవాలనే ఆలోచనకు లోనయ్యే ప్రమాదం ఉందని వివరించారు. అందుకే ఎన్నికల వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని సూచించారు.
డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే సంపద సృష్టితో పాటు పేదరిక నిర్మూలనకు కూడా అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. డిజిటల్ కరెన్సీ ఆలోచనను గతంలోనే తాను ప్రతిపాదించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మరోవైపు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కూడా చంద్రబాబు స్పందించారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చేసిన వైసీపీ, బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నికల్లోనూ ఓటమి చవిచూసిందని విమర్శించారు. ఇకనైనా ఎన్నికల ప్రక్రియపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
2024 ఎన్నికల్లో కూటమికి 55.3 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 39.81 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. తాజా మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం 58.90కు పెరిగిందని, వైసీపీ ఓట్ల శాతం 33.56కు తగ్గిందని వివరించారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే రూ.500 నోట్ల రద్దుపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.