Hyderabad ITAT Ruling: భారతీయ సంప్రదాయంలో పసిడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేడుకలు, పండుగలు, వివాహాలు వంటి సందర్భాల్లో మహిళలు బంగారు నగలను విరివిగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన ఆభరణాలు కూడా అనేక కుటుంబాల్లో కనిపిస్తాయి. అయితే ఇంటి వద్ద ఎంత మేర బంగారాన్ని ఉంచుకోవచ్చు అనే అంశంపై చాలామందిలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు లేదా సోదాలు జరిపినప్పుడు ఇంట్లోని బంగారాన్ని తీసుకుంటారా అనే ఆందోళన కొందరిలో ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) వెలువరించిన తీర్పుతో ఈ విషయంపై స్పష్టత లభించింది.
హైదరాబాద్ ఐటీఏటీ కీలక తీర్పు:
ఇటీవల ఒక పన్ను చెల్లింపుదారుడి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 807.5 గ్రాముల నికర బరువు కలిగిన బంగారు నగలను గుర్తించారు. వాటి విలువను దాదాపు రూ.16.01 లక్షలుగా అంచనా వేశారు. దీనికి తగిన ఆధారాలు లేవన్న కారణంతో ఆ బంగారాన్ని లెక్కల్లో చూపని పెట్టుబడిగా అధికారులు పరిగణించారు. దీనిని సవాలు చేస్తూ ఆ పన్ను చెల్లింపుదారుడు అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ నగలు తనతో పాటు భార్య, కుమార్తె, కుమారుడికి చెందినవని ఆయన వివరించారు. కుటుంబ సభ్యుల వారీగా ఉన్న పరిమితుల లోపే ఆ బంగారం ఉందని ట్రైబ్యునల్ నిర్ధారించింది. ఫలితంగా రూ.16 లక్షల మేర విధించిన అదనపు పన్ను భారాన్ని పూర్తిగా రద్దు చేసింది.
సీబీడీటీ మార్గదర్శకాల పరిమితులు ఇవే:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నిబంధనల ప్రకారం, సోదాల సమయంలో నిర్దిష్ట పరిమితుల్లోపు ఉన్న బంగారు నగలను అధికారులు జప్తు చేయరాదు:
వివాహిత మహిళల విషయంలో గరిష్ఠంగా 500 గ్రాముల వరకు బంగారు ఆభరణాలకు రక్షణ ఉంటుంది.
పెళ్లి కాని మహిళలకు 250 గ్రాముల వరకు బంగారు నగలు కలిగి ఉండే వెసులుబాటు ఉంది.
పురుషుల విషయంలో 100 గ్రాముల వరకు బంగారు నగలను సోదాల్లో జప్తు చేయరు.
ఈ నిర్దేశిత పరిమితులకు లోబడి ఇంట్లో బంగారం ఉంటే అధికారులు దానిని స్వాధీనం చేసుకోరు. అంతేకాకుండా ఆయా కుటుంబాల సామాజిక హోదా, ఆచార వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని అంతకంటే ఎక్కువ బంగారం ఉన్నప్పటికీ పరిశీలించి మినహాయింపునిచ్చే అవకాశం అధికారులకు ఉంటుంది.
ఇంట్లో బంగారం పరిమితిపై ఉన్న అపోహలు:
సీబీడీటీ సూచించిన ఈ పరిమాణాలు ఇంట్లో బంగారం ఉంచుకోవడానికి తుది లేదా గరిష్ఠ పరిమితులు కావు. ఆదాయ వనరులకు సంబంధించిన స్పష్టత ఉంటే ఇంట్లో ఎంత బంగారమైనా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉంచుకోవచ్చు. సరైన కొనుగోలు బిల్లులు, లెక్కలు ఉంటే పరిమితి మించినా ఎలాంటి సమస్య తలెత్తదు. సోదాలు జరిగినప్పుడు వెంటనే నగలను సీజ్ చేయకుండా ఉండటానికే బోర్డు ఈ ప్రమాణాలను మార్గదర్శకంగా రూపొందించింది. వారసత్వంగా వచ్చిన ఆభరణాల విషయంలోనూ వాటి మూలాలను నిరూపించగలిగితే ఎలాంటి ఆంక్షలు ఉండవు.
నగదు నిల్వలపైనా ట్రైబ్యునల్ స్పష్టత:
ఇదే కేసులో ఆ పన్ను చెల్లింపుదారుడి నివాసంలో లభించిన రూ.3.88 లక్షల నగదుపై కూడా అధికారులు అభ్యంతరం తెలిపారు. అయితే ఆ వ్యక్తి వ్యాపార బ్యాలెన్స్ షీట్ లెక్కల ప్రకారం చేతిలో అంతకంటే ఎక్కువ నగదు నిల్వ ఉన్నట్లు ట్రైబ్యునల్ గుర్తించింది. రికార్డుల్లోని లెక్కలతో నగదు నిల్వలు సరిపోలడంతో ఆ నగదుపై విధించిన పన్ను భారాన్ని కూడా ట్రైబ్యునల్ కొట్టివేసింది. తగిన ఆధారాలు, లెక్కలు పక్కాగా ఉంటే ఎలాంటి తనిఖీల సమయంలోనైనా చట్టపరమైన రక్షణ లభిస్తుందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.