Paradise Break Even: న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్యారడైజ్’. ఈ సినిమా షూటింగ్ దశ నుంచి పూర్తయ్యేదాకా ప్రత్యేక హైప్ క్రియేట్ అయ్యింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, ఇషాన్ సక్సేనా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను 70, 80ల నేపథ్యంలో పీరియడ్ డ్రామా గా తెరకెక్కించారు. థియేటర్లలోకి వచ్చిన నాటి నుంచే సరికొత్త సంచలనాలకు వేదికైంది. అంతేకాదు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. సినిమాపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తున్నా సింగిల్ స్క్రీన్లలో మాస్ జాతర కొనసాగుతోంది.
విమర్శకుల ధాటిని తట్టుకొని నిలబడ్డ సినిమా..
ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులు ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అనుకున్నంత ఆక్యుపెన్షీ మాత్రం లేదనే చెప్పాలి. టాలీవుడ్‌లో ఒక సినిమా విజయాన్ని అంచనా వేయడానికి రిలీజ్ రోజే వచ్చే టాక్, రివ్యూలే కొలమానం. ఈ కోవలోనే ' ది ప్యారడైజ్ ' విషయంలోనూ మార్నింగ్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ అనేకంటే నెగిటివ్ టాక్ అధికంగా సాగింది. ముఖ్యంగా కథనంలో సాగతీత, మితిమీరిన రక్తపాతం ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్, డిజాస్టర్ మూవీ అంటూ ప్రచారాలు జోరందుకున్నాయి. సాధారణంగా అయితే ఏ సినిమా అయినా ఇలాంటి నెగెటివ్ టాక్‌తో మొదటి రోజే కుదేలవ్వాలి. కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ 'ది ప్యారడైజ్' సాధించిన వసూళ్లు చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేశాయి.
‘ప్యారడైజ్’ మూవీకి మిక్స్‌డ్ టాక్..
ప్యారడైజ్ మూవీ విడుదలకు ముందుగా సోషల్ మీడియా వేదికగా సినిమాకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు విస్తృత ప్రచారం చేశారు. ట్రోలర్స్ విమర్శలను ఎదుర్కొన్న ప్యారడైజ్ రాజకీయాలకు వేదికగా నిలిచింది. సినిమా రంగంలో ఓ స్థాయికి చేరుకున్న కొందరు అగ్రహీరోల.. అభిమానులు ప్యారడైజ్ సినిమాపై ట్రోల్స్ చేసి సినిమా బాగా లేదనే ప్రచారం ఇపుడు బెడిసికొట్టింది. సినిమా విడుదలైన తర్వాత సినిమా కలెక్షన్లు విమర్శకుల నోళ్లను మూయించిందని హీరో నాని, నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ పూర్తైయినా.. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం నెగిటివ్ టాక్ పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఈ సినిమా ఓవరాల్‌గా ఇప్పటి వరకు రూ. 92 కోట్ల షేర్ (రూ. 165 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు మరో రూ. 9 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది. మొత్తంగా నాని కెరీర్‌లో మూడో రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.
నాని కెరీర్‌లో అత్యధిక బిజినెస్.. అత్యధిక వసూళ్లు..
అంతేకాదు నాని కెరీర్‌లో అత్యధిక బిజినెస్‌తో పాటు ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రంగా ‘ది ప్యారడైజ్’ మూవీ నిలిచింది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి కేవలం తన ప్రతిభతో ఒక పెద్ద మార్కెట్‌ని, సొంత లాయల్ ఫ్యాన్‌బేస్‌ని నిర్మించుకున్న నాని.. ఇప్పుడు టైర్-2 పరిధులను దాటి టైర్-1 హీరోల సరసన నిలిచే స్థాయికి ఎదిగారని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి.
రెండో వారంలో పెద్దగా సినిమాలేవి లేవు దీంతో నాని ‘ది ప్యారడైజ్’కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి మిగిలిన పాత్రల్లో నటించారు. నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించింది. అనిరుధ్ నేపథ్య సంగీతం థియేటర్లలో ప్రకంపనలు రేపుతోంది. మొత్తానికి సాధారణ ప్రేక్షకులకే కాకుండా, రాజకీయ అగ్రనేతలకు సైతం థియేటర్ వైపు అడుగులు వేయించేలా చేసిన ది ప్యారడైజ్ సినిమా ప్రత్యేకతను చాటుకుంది.
సినిమాలో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ అన్న పాత్ర తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆహార్యాన్ని ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ మనవడు హిమాన్షు రావు థియేటర్‌లో ఈ చిత్రం చూసి ఆనందం వ్యక్తంచేశారు. ఆతర్వాత కేటీఆర్ సినిమా థియేటర్ కు వచ్చి సినిమూ చూడటం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ప్యారడైజ్ సినిమాపై ఇచ్చిన రివ్యూ… బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షానికి కొంత ఊపుతెచ్చింది.
కేటీఆర్ ట్వీట్‌తో ‘ది ప్యారడైజ్’ మూవీకి స్పెషల్ క్రేజ్..
నిత్యం ప్రజాక్షేత్రంలో, పార్టీ వ్యవహారాల్లో తలమునకలయ్యే కేటీఆర్.. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి చాలా కాలమైంది. ఆయన కూడా ది ప్యారడైజ్ సినిమాను చూశారు. అభిమాన నటుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమాను వెండితెరపై చూసి ఆయన ఖుషీ అయ్యారు. సినిమాలో అంతర్భాగంగా తెలంగాణ ఉద్యమ సారథి కేటీఆర్ పాత్రను చూసిన కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
కథ విషయానికొస్తే..
1980ల నాటి సికింద్రాబాద్ మురికివాడల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రాథమిక గుర్తింపు, అస్తిత్వం కోసం పోరాడే 'సవారీ' తెగ ప్రజల పోరాటాన్ని కళ్లకు కట్టింది. ఈ తెగకు నాయకురాలైన సమ్మక్క పాత్రలో సోనాలి కులకర్ణి, ఆమె తనయుడు 'జడల్'అలియాస్ సారక్కగా నాని చూపించిన నట విశ్వరూపం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. రెండు జడలతో రగ్గడ్ లుక్‌లో నాని చేసిన పెర్ఫార్మెన్స్ కెరీర్ బెస్ట్ అనే ప్రశంసలు దక్కించుకుంటోంది. మరోవైపు భూస్వామి షికాంజా మాలిక్‌గా సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన క్రూరమైన కుమారుడు విక్రమ్ మాలిక్‌గా బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ విలనిజం ప్రేక్షకులకు థ్రిల్ పంచుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రేక్షకుల గుండెల్లో జడల్ కథ బలమైన ముద్ర వేసిందనే చెప్పాలి.
కేసీఆర్ పాత్రతో ఆకట్టుకున్న ప్రియదర్శి..
కేసీఆర్ పాత్ర సినిమాలో కన్పించినపుడు థియేటర్లలో ప్రేక్షకుల ఈలలు, కేకలతో మాస్ జాతరని తలపిస్తోంది. ప్రియదర్శి కేసీఆర్ పాత్రలో అలరించారు. ఇక ఆయా షేర్, ఏషనాగుల కట్ట పాటలతో సినిమా థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. తల్లి-కొడుకుల సెంటిమెంట్ సీన్లు వీక్షకులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.అనిరుధ్ అందించిన బీజీఎం, పాటలకు థియేటర్లలో స్క్రీన్ల ముందు కుర్రకారు డ్యాన్సులు వేస్తూ రచ్చ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.