Singeetham Cine Career: సింగీతం శ్రీనవాస రావు డైరెక్టర్ గా సినీరంగంలో అన్ని కోణాలను టచ్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ సింగీతం. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన ప్రయోగాలు మరెవరు చేయలేదు. చివరకు చనిపోయే వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. చివరగా ‘సింగ్ గీతం’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఎన్నో అద్భుత చిత్రాలను భారతీయ చిత్రసీమకు అందించిన సింగీతం శ్రీనివాసరావు... 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. తన సినిమాలతో క్లాస్, మాస్ తేడా లేకుండా అందరినీ మెప్పించిన ఘనత ఆయనకే చెల్లింది.
నాటకాలపై మోజు..
నాటకాలపై మోజుతో చిన్నప్పటి నుంచే నటించడం మొదలు పెట్టారు శ్రీనివాసరావు. థియోటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేసిన ఆయన సంగీతం కూడా నేర్చుకున్నాడు. అదే సమయంలో కె.వి.రెడ్డి డైరెక్ట్ చేసిన యోగి వేమన, భక్తపోతన చిత్రాలను చూసి స్ఫూర్తి పొంది ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి చెన్నై రైలెక్కాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తాను అభిమానించే కె.వి.రెడ్డి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే చాన్స్్ వచ్చింది. అక్కడే దర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. కె.వి.రెడ్డి శిష్యరికం సింగీతాన్ని గొప్ప దర్శకుడిగా మార్చింది.
దర్శకుడిగా ఫస్ట్ మూవీ నీతి - నిజాయితీ..
దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం నీతి -నిజాయితీ. అయితే ఈ సినిమా ఆడలేదు. కెరీర్ తొలినాళ్లలో వరుసగా అపజయాలే పలకరించాయి. అలా కొద్ది రోజులు తరువాత ‘అమెరికా అమ్మాయి’ చిత్రంతో సక్సెస్ రుచి ఏంటో చూశారు. ఈ సినిమా సక్సెస్ తో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.ఆ తర్వాత వచ్చిన ‘పంతులమ్మ’ సినిమాతో సింగీతం కెరీర్ గాడిన పడింది. సుమధుర సంగీతంతో తెరెకెక్కిన ఈ చిత్రం అన్ని అబాల గోపాలన్ని అలరించింది.
కమల్ హాసన్‌తో ప్రత్యేక అనుబంధం..
కమల్ హాసన్ లోని వైవిధ్యనటనా కౌశలాన్ని సింగీతం చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. సొమ్మొకడిది సోకొకడిది సినిమాతో ప్రారంభమైన వీరి కాంబినేషన్ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. అమావాస్య చంద్రుడు, విచిత్ర సోదరులు...ఈ అద్భుతాలకో మచ్చుతునకలు మాత్రమే. వీటిల్లో ప్రేక్షకులకు కనిపించే కమల్ వెనుక ఉన్నది సింగీతం దర్శక ప్రతిభే.
మయూరి..
1985లో వచ్చిన మయూరి సినిమాతో సింగీతం శ్రీనివాసరావు పేరు మారుమోగిపోయింది. ప్రముఖ నృత్య కళాకారిణి సుధాచంద్రన్ నిజజీవిత కథ ఆధారంగా...ఆమెనే హీరోయిన్ గా పెట్టి నిర్మించిన ఈ సినిమా దర్శకుడిగా ఆయన ఖ్యాతిని నలుదిశలా వ్యాపించింది. ఆ తర్వాత 1987లో ‘పుష్పక విమానం సినిమా’ అనే మాటలు లేని మూకీ సినిమా తీసి ఔరా అనిపించాడు. టాకీలు ప్రారంభమైన 56 ఏళ్ల తర్వాత మళ్లీ మూకీ సినిమా తీయాలను కోవడమే ఓ సాహసం. అలాంటి చిత్రాన్ని ప్రేక్షకుల మెప్పు పొంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఘనాపాటి సింగీతం. తొలి టాకీ రూపకర్త హెచ్.ఎమ్.రెడ్డి తర్వాత మూకీలను, టాకీలను డైరెక్ట్ చేసిన ఒకే ఒక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆ తర్వాత ఎవరో ఒకరిద్దరు ఈ సాహసం చేసారు.
ఆదిత్య 369 తొలి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ..
సింగీతం సినీజైత్రయాత్రలో మరో మజీలీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా.. టైంమిషన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ను అలరించింది. శ్రీ కృష్ణ దేవరాయల వైభవాన్ని...ఆనాటి స్వర్ణయుగాన్ని చాలా అందంగా తెరకెక్కించారు. దీనితో పాటు భవిష్యత్తులో జరగబోయే సాంకేతిక విప్లవాన్ని చూపించి తన దార్శనికతను ప్రదర్శించిన ఘనత ఆయనకే చెల్లింది.
భైరవ ద్వీపం మరో సంచలనం..
జానపదాలకు ఆదరణ లేని సమయంలో జానపద కథాంశంతో భైరవద్వీపం సినిమా తీసి బంపర్ హిట్ కొట్టారు సింగీతం. హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు వస్తున్న కాలంలో...దీనికి విరుద్ధంగా హీరోను అందవికారంగా కురూపిగా చూపించి మెప్పించిన ఘనత సింగీతానకే దక్కింది.
ఆర్ట్ సినిమాల నుంచి అన్ని జానర్స్‌ను టచ్ చేసిన డైరెక్టర్..
దర్శకుడిగా ఆయన కెరీర్ ఆర్ట్ సినిమాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రయోగాత్మక చిత్రాలకు శ్రీకారం చుట్టాడు. సినీరంగంలో సింగీతం చేయని ప్రయోగం లేదు..చేపట్టని ...ప్రక్రియలేదు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, మూకీ, కార్టూన్, సంగీత నేపథ్యం..అంటూ అన్నిరకాల చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక డైరెక్టర్‌గా సింగీతం నిలిచిపోయారు. అందుకే వైవిధ్య కథా చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.
ఎన్నోఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన వెండితెర మాంత్రికుడు... చివరగా ‘సింగ్ గీతం’ సినిమాతో పలకరించారు. ఈయన మృతితో భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. ఈయన మృతికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.