కన్నడలో బ్లాక్ బస్టర్.. తెలుగు ప్రేక్షకుల రెస్సాన్స్ ఇదే..
Premane Oorilo Review: కన్నడలో గత వారం విడుదలైన మంచి విజయం సాధించిన చిత్రం ‘ప్రేమద ఊరెళి’. ఈ చిత్రం తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’ రిలీజ్ చేసారు. మరి గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.
Premane Oorilo Review: శ్రీరామ్, రమిక శివు తపస్పిని పూనాచ, రంగాయణ రఘు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. శాండిల్‌వుడ్‌లో లాస్ట్ వీక్ రిలీజై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మమత దేవేంద్ర ఈ సినిమా నిర్మించగా మనోజ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో మహారత్న ప్రొడక్షన్స్, SK పిక్చర్స్ బ్యానర్ పై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి విడుదల చేసారు. మరి ఈ చిత్రం కన్నడ ప్రేక్షకుల ఆదరణ పొందినట్టే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదిరించారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
నాగన్న (రంగాయన రఘు) తల్లి లేని తన కొడుకు సంతోష్(శ్రీరామ్) ను అపురూపంగా పెంచుతాడు. పెరిగిపెద్దవాడైన సంతోష్ వ్యవసాయం చేస్తుంటాడు. అదే క్రమంలో మరదలు వసంత (రమిక శివు) ప్రేమిస్తుంది. కానీ కుమారుడికి మంచిగా చదువుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనేది తండ్రి ఆశ. మరోవైపు సంతోష్.. తనకున్న కమిట్‌మెంట్స్ కారణంగా వచ్చిన సంబంధాలు ఏవి సెట్ కావు. మరోవైపు ఫారెన్ నుంచి వచ్చిన రుక్మిణి (తపస్విని పూనాచ)ను తొలిచూపులోనే లవ్‌లో పడిపోతాడు. మరోవైపు తండ్రి.. తన స్నేహతుడి కూతురును పెళ్లి చేసుకోమని బలవంత పెడతాడు. ఈ క్రమంలో నాన్న చూసిన పెళ్లి కూతురును అతడు పెళ్లి చేసుకున్నాడా..? తన ప్రేమించి యువతిని పెళ్లాడాడా..? లేకపోతే తనను ప్రేమించిన మరదలి మెళ్లో తాళి కట్టాడా ? చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ప్రస్తుతం తెలుగు సహా ఇతర భాషల్లో రక్తపాతం ఉన్న యాక్షన్ సినిమాలేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మరోవైపు ప్రేమకథలను కూడా ఆరాధిస్తున్నారు. ఈ కోవలో స్వచ్ఛమైన పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ‘ప్రేమనే ఊరిలో’ సినిమా. మొత్తంగా ఫ్యామిలీ కుటుంబ సంబంధాల నేపథ్యంలో క్లీన్ ఎంటర్టేనర్ గా ఈ సినిమా ఉండటం ఈ సినిమా స్పెషాలిటీ. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. ఆ తర్వాత కీలకమైన కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. తొలి భాగం హాస్యంతో కూడిన సన్నివేశాలతో సరదగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే పెళ్లి ట్విస్ట్‌తో తర్వాత ఏం జరగుతుందనే దానిపై ఆసక్తి రేకిత్తించాడు.
ఇక సెకండాఫ్‌లో ఎమోషన్స్.. పెళ్లి తర్వాత భార్యా భర్తల మధ్య వచ్చే మనస్పర్థలు.. మరోవైపు మరదలి ఎమోషనల్ ప్రయాణాన్ని హృద్యంగా తెరపై ఆవిష్కరించాడు.ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. చివరి అరగంట ప్రేక్షకులను కంటతడితో పాటు భావేద్వేగానికి గురి చేస్తాయి. మొత్తంగా ఈ చిత్రంలో రైతులతో పాటు మహిళల సమస్యలను ప్రస్తావిస్తూ ఇచ్చే సందేశం బాగుంది. కాస్త ల్యాగ్ గా ఉన్న కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.
టెక్నికల్ విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను కెమెరాలో బంధించిన విధానం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. కొన్ని చోట్ల సన్నివేశాలకు లిప్ సింక్ కాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ కన్నడ బ్లాక్ బస్టర్.. తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందనేది చూడాలి.
నటీనటుల విషయాకొస్తే..
సంతోష్ క్యారెక్టర్‌లో శ్రీరామ్ మంచి నటన కనబరిచాడు. పల్లెటూరి కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. మరోవైపు ప్రేమికుడిగా.. భర్తగా అతని చూపించి నటన బాగుంది. రమిక ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించింది. రుక్మిణి క్యారెక్టర్‌లో తపస్పిని నటన బాగుంది. తండ్రి పాత్రలో నటించిన రంగాయన రఘు తన పాత్రలో జీవించాడు. ఎంతో సహజ సిద్ధంగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘ప్రేమనే ఊరిలో’.. ‘హృద్యంగా సాగే పల్లెటూరి ప్రేమగాథ’.
రేటింగ్: 2.75/5