Dont Trouble The Trouble: ‘పుష్ప’ సినిమాలో ఎస్పీ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యాడు ఫహద్ ఫాజిల్. ఈయన హీరోగా తెలుగులో నటించిన తొలి చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను బాలయ్య, ఎన్టీఆర్, మహేష్ భుజాలపై వేసుకొని ప్రమోషన్ చేసి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
సూరి (ఫహద్ ఫాజిల్) ఓ అనాథ. డబ్బు కోసం ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడని వాడు. అతని స్నేహితుడు (వెంకటేష్ కాకుమాను)తో ఉంటుంటాడు.సూరి పాతబస్తీలో ఉండే అస్లాం భాయ్ (మహేష్ మంజ్రేకర్)తో ఓ పందెం కాసి మోసం చేసి గెలుస్తాడు. అసలు విషయం తెలుసుకున్న అస్లాం భాయ్.. సూరికి వార్నింగ్ ఇస్తాడు. రెండు రోజుల్లో తనకు రూ. 25 లక్షలు నష్టపరిహారం కట్టాలని చెబుతాడు. లేకపోతే అతని ఒంట్లోని పార్ట్స్‌ను అమ్ముకుంటానని బెదిరిస్తారు. దీంతో ఎలాగైనా రూ. 25 లక్షలు సంపాదించాలనే కసితో ఎవరైనా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వారి పేరేంట్స్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడతాడు. ఈ క్రమంలో అతనికి ఓ పాప దివ్య (సారా పాలేకర్) కనిపిస్తుంది. ఆమె తన తల్లిదండ్రులున మాయం చేసానని చెబుతుంది. ఈ క్రమంలో ఆమెను మంచి చేసుకొని ఇంటికి తీసుకెళతాడు. అంతేకాదు పాపను అడ్డుపెట్టుకొని వారి తల్లిదండ్రుల నుంచి రూ. 1 కోటి రాబట్టాలనుకుంటాడు. అందులో రూ. 25 లక్షలు అస్లామ్ కు ఇచ్చి మిగిలిన డబ్బులతో దుబాయ్ లో సెటిల్ కావాలనుకంటాడు. ఈ క్రమంలో అతనికో భయంకరమైన నిజం తెలుస్తుంది. దివ్య వచ్చిన తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. చివరకు అస్లాం భాయ్ కు కట్టాల్సిన 25 లక్షల రూపాయలు కట్టాడా..? చివరకు తాను మాయం చేసానన్న పాప తల్లిదండ్రులను చివరకు కలుసుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
హీరో ఓ అనాథ. డబ్బు కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడని మనస్తత్త్వం. అలాంటి వ్యక్తి ఓ డాన్ దగ్గర తప్పుడు పందెం కాసి దొరికిపోతాడు. దీంతో ఓల్డ్ సిటీ డాన్ హీరోను విడిచిపెట్టడానికి రూ.25 లక్షలు డిమాండ్ చేస్తాడు. లేకపోతే చంపేస్తా అని చెప్పడంతో వేరే దారి లేని కథానాయకుడు ఎవరైనా చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి ఆ వచ్చిన డబ్బుల్లో డాన్ కొంత ఇచ్చేసి మిగిలిన డబ్బుతో సెటిల్ కావాలనుకుంటాడు. ఇలాంటి తరహా కథలు తెలుగు సహా పలు సినిమాల్లో చూసిందే. కానీ పాప రాకతో నీచ్ కమినే టైపు హీరో జీవితం ఎలాంటి మార్పు చోటుచేసుకుంది. ఆమె రాకతో అతని జీవితం ఎలా పరివర్తన చెందింది.
అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి లాజిక్స్ వెతక్కూడదు. ఇందులో పాప, హీరో మధ్య బాండింగ్ వారి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తాయి. పాప మాములు మనిషి కాదని తెలసుకున్న తర్వాత హీరో రియాక్షన్.. ఇక పాప అతీత శక్తులు వాడుకొని విలన్స్‌ను హీరో చిత్తు చేయడం మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో కొంచెం వాయిలెన్స్ కొంచెం చూపెట్టినా.. పాప ఎంట్రీ తర్వాత సినిమా పరిగెత్లించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ప్రేక్షకులను భావోద్వేగంతో పాటు కంటి తడిపెట్టిస్తాయి. ఇందులో క్లైమాక్స్ ప్రేక్షకులకు ఊహకు దగ్గరగా ఉంటుంది. కానీ ఈ తరహా క్లైమాక్స్ మన తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు ఒప్పుకుంటారనేది చూడాలి. అందుకే దర్శకుడు శశాంక్ యేలేటి ఏరికోరి మరి మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్‌ను ఈ సినిమాలో హీరోగా తీసుకున్నాడనే విషయం అర్ధమవుతుంది. పాపతో పాటు ఫహద్ ఫాజిల్‌లతో మంచి నటన రాబట్టుకున్నాడు. కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సందర్భాను సారంగా వచ్చే ఓ పాట ఆకట్టుకునే ఉంది. ఎడిటర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ వర్క్స్ బాగున్నాయి. ఆర్కా మీడియా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు.
నటీనటుల విషయానికొస్తే..
ఫహద్ ఫాజిల్ సూరి పాత్రలో జీవించాడు. పైసల కోసం ఎలాంటి లుచ్ఛా పనైనా చేయడానికి వెనకాడని మనస్తత్త్వం ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. కన్నింగ్ లాంటి అతని జీవితంలోకి పాప ఎంట్రీ తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయా సందర్బాల్లో అతని నటన బాగుంది. క్లైమాక్స్‌లో ఫహద్ సెంటిమెంట్ సీన్స్‌లో అదరగొట్టేసాడు. దివ్య పాత్రలో సారా పాలేకర్ అద్భుతంగా చేసింది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. మహేష్ మంజ్రేక్ తనదైన విలన్ పాత్రలో మెప్పించాడు. చాలా రోజుల తర్వాత శశాంక్ పిల్ల తండ్రి పాత్రలో కనిపించి అలరించాడు.హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన వెంకటేష్ కాకుమాను మెప్పించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రుబుల్’.. మెప్పించే ఫాంటసీ డ్రామా. .