తత్త్వం మూవీ రివ్యూ.. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మెప్పించిందా..!!
Tatvam Review: దినేష్ తేజ్, దష్విక జోడిగా నటించిన చిత్రం ‘తత్త్వం’. అర్జున్ కోలా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాను ఒక రోజు ముందుగా మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Tatvam Movie Review Rating Public Talk: గత కొన్నేళ్లుగా తెలుగులో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘తత్త్వం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేరకు ఎంగేజ్ చేసిందో మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
రామాపురం గ్రామంలో సుధ సైకోగా మారి తన తల్లిదండ్రులను హత మారుస్తాడు. ఈ నేపథ్యంలో ఊరివాళ్లందరు కలిసి అతన్ని పట్టి పోలీసులకు అప్పగించాలనుకుంటారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు కంప్లైంట్ చేస్తారు. అయితే ఆ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎస్సై కావాలనునే కళ్యాణ్ (దినేష్ తేజ్) రామాపురం గ్రామానికి చెందిన ఊరి పెద్ద కూతురును సౌమ్య (దష్విక) పెళ్లి చూపులు చూడడానికి వెళతాడు. అదే సమయంలో స్టేషన్ ఎస్సై ఆ ఊరిలో జరిగిన మర్డర్ కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకోమని చెబుతాడు. పెళ్లి చూపులకని వచ్చిన హీరోకు అనుకోకుండా మర్డర్ కేస్ ఓ సవాల్‌గా మారుతుంది. ఊరి వాళ్లు సుధనే తన తల్లిదండ్రులను హతమార్చారని చెబుతుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం అతను ప్రత్యక్షంగా చంపడం ఎవరైనా చూసారా అనే కోణంలో దర్యాప్తు చేపడతాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. చివరకు ఈ మర్డర్ మిస్టరీని కళ్యాణ్ ఏ విధంగా చేధించాడు. తన కోరుకున్న అమ్మాయి సౌమ్యతో అతని పెళ్లైందా.. చివరకు ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగులో ఈ మధ్యకాలంలో మర్డర్ మిస్టరీల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. తత్త్వం చిత్రాన్ని దర్శకుడు అర్జున్ కోలా పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ సినిమాలో కథలోకి తీసుకెళ్లడానికి దాదాపు 20 నిమిషాలు పైగా తీసుకున్నాడు. ఈ క్రమంలో ఊరిలో కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనపెట్టుకోవడంతో అతన్ని బంధించి పోలీసులకు అప్పగిస్తారు ఊరివాళ్లు. ఇక ఆ ఊరికి పెళ్లి చూపులకు వచ్చిన కానిస్టేబుల్.. ఈ కేసును ఛేదించే పనిలో పడతాడు. ముఖ్యంగా హంతకుడు అని చెబుతున్న వాడు అతను మర్డర్ చేస్తుండగా ఎవరైనా ఐ విట్నెస్ ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టి .. ఒక్కో వ్యక్తిపై అనుమానం క్రియేట్ చేసేలా చేసి చివరకు ఎవరు మర్డర్ చేసారనే ట్విస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా.. దాన్ని ఇంకాస్త పకడ్బందీగా తెరకెక్కించిన ఉంటే ఈ సినిమా రిజల్డ్ మరోలా ఉండేది. కానీ దర్శకుడు ఉన్న వనరులతో పూర్తిగా గ్రామంలోనే షూట్ చేయడం బాగుంది. అక్కడ పల్లె వాళ్ల మనసులు, కుట్రలు, కుతంత్రాలు..అన్ని తెరపై చూపించడంలో ఓ మోస్తరు సక్సెస్ అయ్యాడు. కథనం స్లోగా సాగడం ప్రేక్షకులకు ఒకింత బోర్ కొట్టించే అంశం.
క్రైమ్, మిస్టరీ, ఆధ్యాత్మికత, తాత్విక అంశాల చుట్టూ అల్లుకున్న అంశాలు బాగున్నాయి. ఒక వ్యక్తి తన సామాజిక పరిస్థితులే కాకుండా నమ్మకం, నిజం, విచక్షణ, సామాజిక చైతన్యం చుట్టూ అల్లుకున్న విధానం ఆలోచింప చేస్తుంది.
సినిమాలో హీరోను కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా రాత పరీక్ష రాసి ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండే పాత్రలో హీరోను చూపించిన విధానం బాగుంది. హీరో, హీరోయిన్స్ మధ్య కొన్ని సీన్స్ కథకు కీలకంగా నిలిచాయి. సినిమాకు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పదును పెడితే బాగుండేది. సినిమాలను 20 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
హీరోగా దినేష్ తేజ్ చూడ్డానికి లుక్స్ పరంగా బాగా ఉన్నాడు. తన హ్యాండ్సమ్ లుక్‌తో ఎస్సై కావాలనుకునే కళ్యాణ్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో ఎక్కడా అతి కాకుండా నాచురల్‌గా కనిపించాడు. నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది. కథానాయికగా నటించిన దష్విక తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఇక హీరోయిన్ ఇంట్లో పనిచేసే పాత్రలో నటించిన నటుడు మంచి కామెడీ పండించాడు. ఊరి పెద్ద, ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఇష్టపడే వాళ్లు.. ఈ వీకెండ్ ఈ సినిమా చూడొచ్చు.
పంచ్ లైన్..‘తత్త్వం’ మెప్పించే క్రైమ్ మర్డర్ థ్రిల్లర్..
రేటింగ్: 2.75/5