సినిమాలకు ఓకే.. పెళ్లికి నో..!.. టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలు..!
Tollywood Most Eligible Bachelors: టాలీవుడ్‌లో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెట్టేసి ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ యేడాది విజయ్ దేవరకొండ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలా ఇద్దరు కొండలు కూడా పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ సహా కొంత మంది హీరోలు ‘సోలో బ్రతుకు సో బెటర్’ అంటూ పెళ్లి చేసుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతకీ ఈ యేడాది చివరి వరకైనా ఈ హీరోలు బ్యాచిలర్ లైఫ్‌కు బై బై చెబుతారా లేదా అనేది చూడాలి.
Prabhas To Adivi Sesh Tollywood most Eligible Bachelors: టాలీవుడ్‌లో హీరోల పెళ్లి అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం మాత్రమే కాదు.. అభిమానులకు కూడా అది ఒక పెద్ద ఈవెంట్ లాంటిదే. తమ అభిమాన హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు? అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎప్పుడూ ఉంటుంది.
ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు పెళ్లి చేసుకుని సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో ఇంకా కొంతమంది హీరోలు మాత్రం బ్యాచిలర్‌గానే కొనసాగుతున్నారు. వయసు పెరుగుతున్నా.. పెళ్లి గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
దీంతో ఈ హీరోల మ్యారేజ్ ఎప్పుడు? అనే ప్రశ్న సోషల్ మీడియాలోనూ, అభిమానుల్లోనూ తరచూ చర్చకు వస్తోంది.
ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ‘రెబల్ స్టార్ ప్రభాస్. మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అని చెప్పాలి. ఈ నెల 23తో 47వ పడిలో పడతాడు. గత పుష్కర కాలంగా ప్రభాస్ పెళ్లి వార్తలు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నారు. మీడియా ఈయన పెళ్లిని అనుష్కతో ఎన్నిసార్లు చేసారో చెప్పాల్సిన పనిలేదు. రెబల్ స్టార్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో సందర్భాల్లో ప్రచారం జరిగినా.. ఇప్పటివరకు అధికారికంగా మాత్రం ఏ విషయం బయటకు రాలేదు. ప్రభాస్ కూడా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పెద్దగా బయటపెట్టలేదు.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమాను లైన్‌లో పెట్టుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. దీంతో ఆయన పెళ్లి కంటే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే చర్చ కూడా కొనసాగుతోంది.
ఇక ఈ జాబితాలో మరో ఇంట్రెస్టింగ్ పేరు ‘అడివి శేష్’..
మరో రెండు నెలల్లో 41వ ఏట అడుగుపెట్టబోతున్నాడు శేష్. ఇప్పటికీ తన సినిమాల విషయంలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో, వ్యక్తిగత విషయాల్లో మాత్రం అంతే సైలెంట్‌గా ఉంటారనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, డేటింగ్ వంటి విషయాలపై ఆయన చాలా తక్కువగా స్పందిస్తుంటారు.
తన సినిమాలపైనే ఫోకస్ పెట్టే శేష్.. ప్రస్తుతం తన సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్ ‘గూఢచారి’కి సంబంధించిన తదుపరి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన మ్యారేజ్ ప్లాన్స్ ఏంటి అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.అయితే బడా ఫ్యామిలీకి చెందిన మాజీ కథానాయిక కమ్ నిర్మాతతో ఈయనకు ఎఫైర్ నడుస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై శేష్ క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.
ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఈ లిస్ట్‌లో కనిపించే పేరు ‘సాయి ధరమ్ తేజ్’..
మరో వారం రోజుల్లో 40వ పడిలోకి అడుగుపెట్టబోతున్న సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి గత కొంతకాలంగా అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు పలుమార్లు వినిపించాయి. అంతేకాదు.. ఒక దశలో తానే పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్.. ఈ ఏడాది అయినా పెళ్లి విషయంలో గుడ్ న్యూస్ చెబుతారా? అన్నది ఆసక్తిగా మారింది.
ఇక ‘రామ్ పోతినేని’ విషయానికి వస్తే.. ఆయనకు ఇప్పటికే 38 ఏళ్లు.
సినిమాల్లో ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రామ్.. తన వ్యక్తిగత జీవితానికి మాత్రం చాలా ప్రైవసీ మెయింటెన్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఆయన ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడరు.
కొంతకాలంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రామ్‌కు సంబంధం ఉందంటూ రూమర్స్ వినిపించినా.. వాటిపై ఇద్దరి నుంచి స్పష్టమైన ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం తన 23వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న రామ్.. ఈ చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్నాడు. ఏది ఏమైనా తన పెళ్లి విషయంలో మాత్రం ఇంకా సైలెంట్‌గానే ఉన్నారు.
ఇక చివరిగా ‘సందీప్ కిషన్’..
39 ఏళ్ల సందీప్ కిషన్ చాలా కాలంగా తెలుగు, తమిళ సినిమాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితంపై అప్పుడప్పుడూ కొన్ని రూమర్స్ వచ్చినా.. అవేవీ పెళ్లి వరకు వెళ్లలేదు.
సినిమాలే తన ప్రపంచంగా ముందుకు సాగుతున్న సందీప్.. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ఈ బ్యాచిలర్ హీరో కూడా త్వరలోనే పెళ్లి విషయంలో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అటు తెలుగు హీరోలు సుశాంత్, రాజ్ తరుణ్, తరుణ్ వంటి హీరోలు కూడా ఇప్పటికీ సోలో బ్రతుకు సో బెటర్ అంటూ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.
మొత్తానికి.. ప్రభాస్ నుంచి సందీప్ కిషన్ వరకు.. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లి వార్త కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి వీరిలో ముందుగా పెళ్లి పీటలు ఎక్కబోయేది ఎపుడు? ఎవరైనా సడన్‌గా గుడ్ న్యూస్ చెప్పి ఈ యేడాది చివరి వరకు అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తారా? లేక ఇంకా కొంతకాలం బ్యాచిలర్ లైఫ్‌నే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి?