టాలీవుడ్‌లో నెగెటివ్ ప్రాపగాండా.. కులం, ప్రాంతం పేరుతో విభజన ఎందుకు?
Tollywood Negative Propaganda: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నెగిటిల్ ప్రాపగాండ నడుస్తోంది. ఓ సినిమా రిలీజ్ కాకుండానే బాగాలేదటా అంటూ విడుదలకు ముందే చంపే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు.. వేల కుటుంబాలకు ఉపాధి. వందలాది మంది నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకులు, నిర్మాతలు, కార్మికుల కష్టం. కానీ ఈ మధ్య సినిమా రిలీజ్‌కు ముందే మరో యుద్ధం మొదలవుతోంది. అది సినిమాపై కాదు.. సోషల్ మీడియాలో వ్యక్తులపై, ప్రాంతాలపై, కులాలపై కొంత మంది విభజన తీసుకొస్తున్నారు.
Tollywood Negative Trend: ఒక సినిమా వస్తుందంటే చాలు.. టీజర్, ట్రైలర్, పాట, పోస్టర్ నుంచి హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అనే దాని వరకు సోషల్ మీడియాలో చర్చ మొదలవుతోంది. చర్చ ఆరోగ్యకరంగా ఉంటే సమస్య లేదు. కానీ కొన్నిసార్లు అది నెగెటివ్ ప్రాపగాండాగా మారుతోంది.
ముఖ్యంగా తెలంగాణ–ఆంధ్ర పేరుతో జరుగుతున్న ప్రాంతీయ ట్రోలింగ్ ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.
ఒక హీరో తెలంగాణకు చెందినవాడైతే.. మరో హీరో ఆంధ్రకు చెందినవాడని చెప్పడం. ఒక సినిమా తెలంగాణ నేటివిటీతో ఉంటే దాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం. మరో సినిమా ఆంధ్ర నేటివిటీతో ఉంటే మరో ప్రాంతం పేరుతో ట్రోల్ చేయడం.. ఇవన్నీ సినిమా పరిధిని దాటి ప్రాంతీయ విభజనకు దారితీస్తున్నాయి.
తెలంగాణ అయినా.. ఆంధ్ర అయినా.. సినిమా ప్రేక్షకుడికి ప్రాంతం కంటే సినిమా ముఖ్యం. హైదరాబాద్‌లో సినిమా చూసే ప్రేక్షకుడు ఆంధ్ర నుంచి వచ్చిన సినిమా అయినా ఆదరిస్తాడు. ఆంధ్రలోని ప్రేక్షకుడు తెలంగాణ నేటివిటీ ఉన్న సినిమా అయినా ఆదరిస్తాడు.ఇది ఎన్నో సార్లు ప్రూవ్ అయిందే.
అయితే సోషల్ మీడియాలో కొందరు మాత్రం సినిమా పోటీని ప్రాంతాల పోటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదే పరిస్థితి కులం విషయంలోనూ కనిపిస్తోంది.
ఒక నటుడు ఏ కులానికి చెందినవాడు? దర్శకుడి కులం ఏంటి? నిర్మాత ఎవరు? అంటూ సినిమాకు సంబంధం లేని విషయాలను ముందుకు తీసుకురావడం మొదలైంది. ఒక హీరో అభిమానాన్ని కుల అభిమానంగా మార్చడం.. మరో హీరోను అదే పేరుతో టార్గెట్ చేయడం.. చివరకు ఫ్యాన్ వార్స్ కాస్త కులాల మధ్య గొడవలుగా మారడం ఎంతవరకు సమంజసం అని చెప్పాి.
సినిమా టికెట్ కొనేటప్పుడు ప్రేక్షకుడిని కులం అడగరు. థియేటర్‌లో సీట్లో కూర్చున్నప్పుడు ప్రాంతం అడగరు. మరి తెరపై సినిమా చూస్తున్నప్పుడు ఈ విభజన ఎందుకు?
విమర్శించడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. నటన బాగాలేదని చెప్పొచ్చు. కథలో లోపాలున్నాయని విమర్శించొచ్చు. కానీ విమర్శ పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం, కుటుంబాలను టార్గెట్ చేయడం, కులం–ప్రాంతం పేరుతో ట్రోలింగ్ చేయడం మాత్రం ఆరోగ్యకరమైన సినీ సంస్కృతి కాదనే చెప్పాలి.
మరోవైపు.. ఫ్యాన్స్ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
ఒక హీరో సినిమా హిట్ అయితే మరో హీరో సినిమా ఫెయిల్ కావాలని కోరుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక సినిమా సక్సెస్ అయితే పరిశ్రమలోని ఎంతోమంది కుటుంబాలకు ఉపాధి వస్తుంది. ఒక సినిమా విజయం అంటే ఒక్క హీరో విజయం కాదు.. మొత్తం టీమ్ విజయం.అలాగే ఒక సినిమా ఫెయిల్ అయితే దాన్ని సెలబ్రేట్ చేయడం కూడా ఆరోగ్యకరమైన పోటీ కాదు.
తెలంగాణ వేరు.. ఆంధ్ర వేరు కావచ్చు. ప్రాంతీయ సంస్కృతులు వేరు కావచ్చు. కానీ తెలుగు సినిమా ప్రేక్షకుడి ప్రేమకు సరిహద్దులు లేవనేవి ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. అదే విధంగా కులాలు వేరు కావచ్చు.. రాజకీయ అభిప్రాయాలు వేరు కావచ్చు.. కానీ సినిమా పరిశ్రమ అందరిదీ.
సోషల్ మీడియా మన చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధం. దాన్ని ప్రతిభను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తే పరిశ్రమ ఎదుగుతుంది. అదే కులం, ప్రాంతం, వ్యక్తిగత ద్వేషాల కోసం ఉపయోగిస్తే మనమే మన పరిశ్రమన విభజించుకున్నట్టవుతుంది.రీసెంట్‌గా ‘ప్యారడైజ్’ పై తెగ నెగిటివ్ ప్రచారం చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ .. ‘రణబాలి’ సినిమాపై నెగిటిల్ ట్రోల్ మొదలైంది. దీనిపై విజయ్ దేవరకొండ బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఇదే తరహా పరిస్థితిని ఫేస్ చేశారు.
టాలీవుడ్‌లో అనాదిగా నెగిటివ్ ప్రాపగాండ..
ఈ నెగిటివ్ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలకే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఒకపుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మధ్య ఫ్యాన్స్ నెగిటివ్ ప్రాపగాండ చేసిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత కృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఇలాంటి ఫ్యాన్ వార్ నెగిటివ్ ప్రాపగాండ కనిపించేది. ఒకపుడు తమ ప్రత్యర్ధి హీరోలపై వేరే హీరో ఫ్యాన్స్ పోస్టర్స్ పై పేడ కొట్టి తమ అక్కసు తీర్చుకునేవారు.
చిరు, బాలయ్యలకు తప్పలేదు నెగిటివ్ ప్రాపగాండ..
ఇక చిరంజీవి, బాలకృష్ణల జమానాలో ఒక హీరో సినిమాపై మరో ఫ్యాన్స్ కావాలని కక్ష కట్టి మరి నెగిటివ్ ప్రచారాలు చేసిన సందర్భాలున్నాయి. చిరంజీవి సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ నెగిటివ్ ప్రాపగాండ చేయడం.. బాలయ్య సినిమాలపై చిరు ఫ్యాన్స్ బాగాలేదని చెప్పడం ఎప్పటి నుంచో ఉంది. అటు ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వంటి హీరోల ఫ్యాన్స్ మధ్య ఇలా నెగిటివ్ ప్రాపగాండ అనేది ఉంది. ముఖ్యంగా తమ హీరోనే గొప్ప. తమ హీరోవే అసలైన రికార్డ్స్, పక్క హీరోవి ఫేక్ రికార్డ్స్ అంటూ దుష్ప్రచారం చేసిన సందర్భాలు కోకొల్లలు. హీరోలు మాత్రం బాగుంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇలా సోషల్ మీడియా వేదికగా ఓ హీరో అభిమానులు పక్క హీరోల సినిమాపై నెగిటివ్ ప్రాపగాండా చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒకపుడు పోస్టర్స్ పై పేడ కొట్టే స్థాయి నుంచి ఇపుడు సామాజిక మాధ్యమాల స్థాయికి పెరిగింది అంతే.
అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే..
సినిమాను సినిమాగా చూస్తామా?లేక కులం, ప్రాంతం, ఫ్యాన్ వార్ అద్దంలో చూసి తీర్పు ఇస్తామా?
ఎందుకంటే చివరికి ప్రేక్షకుడి ముందుకు వచ్చేది ఒకటే..కులం కాదు.. ప్రాంతం కాదు..సినిమా!మరి ఆ సినిమాకు తీర్పు చెప్పాల్సింది ట్రోలింగ్ గ్యాంగులు కాదు..తెలుగు ప్రేక్షకులే.