Singeetham Srinivas Shelved movies: సింగీతం శ్రీనివాస రావు తన కెరీర్‌లో ఎక్కువగా కమల్ హాసన్‌తో సినిమాలు చేశారు. ఇక తెలుగులో బాలకృష్ణతో మన దేశపు తొలి సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ ‘ఆదిత్య 369’ సినిమాతో సంచలనం రేపారు. ఆ తర్వాత వీళ్ల కలయికలో ‘భైరవ ద్వీపం’ సినిమా వచ్చింది. జానపదాలు కనుమరుగు అవుతున్న సమయంలో బాలయ్యతో చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది.
అంతేకాదు ఈ సినిమా సాధించిన సంచలన విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘భూలోక వీరుడు’ పేరుతో జానపద సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మాత. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు చిరంజీవి,సింగీతంకు కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అలా చిరంజీవితో సింగీతం శ్రీనివాస రావు ప్రాజెక్ట్ అటకెక్కింది.
పవన్‌తో జీసెస్ క్రైస్ట్ మూవీ ఆగిపోయింది..
ఆ తర్వాత చాలా యేళ్లకు పవన్ కళ్యాణ్‌తో ‘జీసెస్ క్రైస్ట్’ పేరుతో ఓ సినిమా చేద్దామనుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘జీసెస్’ పాత్రలో నటించబోతున్నట్టు చెప్పారు కూడా. అంతా రెడీ అయిదనుకుంటున్న వేళ ఈ ప్రాజెక్ట్ సెట్స్ వెళ్లకుండానే ఆగిపోయింది. ఇలా అన్నదమ్ములపైన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో అనుకున్న ప్రాజెక్టులు ముందుకు సాగక సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. అటు నాగార్జునతో ఆదిత్య 369 తర్వాత ఓ సోషియో ఫాంటసీ ఫిల్మ్ అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత చాలా యేళ్లకు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో నాగార్జున హీరోగా ‘ఆకాశవీధిలో’ సినిమా వచ్చింది. ఈ చిత్రం పెద్దగా అలరించలేకపోయింది.
సింగీతం విషయానికొస్తే.. తెలుగులో ‘మాయా బజార్’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలై.. ఆ తర్వాత ఎన్నో విభిన్న చిత్రాలతో అలరించారు. చివరగా ‘సింగ్ గీతం’సినిమాతో పలకరించారు. ఈ యేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది.