SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

భూటాన్‌లో హిమనీనద సరస్సు విస్ఫోటం.. పర్వత ప్రాంతంలో విరుచుకుపడిన ప్రకృతి విపత్తు..

Bhutan Natural Calamity: నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల ఘటన మరువకముందే.. ఇప్పుడు భూటాన్‌లో మరో హిమ సరస్సు బద్దలైవడం ఆందోళన కలిగిస్తోంది. పర్వత ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడిన ప్రకృతి విపత్తు.. ఇప్పుడు భారత్‌లోని నదీ పరివాహక ప్రాంతాలను వణికిస్తోంది. భూటాన్‌లోని షింటాఫు హిమ సరస్సు బద్దలవడంతో భారీగా వరద నీరు దిగువకు ప్రవహించే ప్రమాదం ఏర్పడింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 09:29 AM IST | Updated: Oct 31, 2026, 09:31 AM IST
Image Credit: Bhutan Glassier (ZEE News Telugu/Source)
Join

Glacial Lake Outburst: హిమానీనదం నీటి ప్రవాహం భారత్‌లోకి చేరితే సంకోష్‌ నది ఉప్పొంగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌, అసోంలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. భూటాన్‌ నుంచి వచ్చే వరద నీరు భారత్‌-భూటాన్‌ సరిహద్దుకు చేరవచ్చని అధికారులు తెలిపారు. దీంతో నదీ తీర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

17 హిమ సరస్సులో ఒకటి.. 
భూటాన్‌లోని గాసా జిల్లాలో వాకిలా పర్వతం దిగువన ఉన్న షింటాఫు హిమ సరస్సు గురువారం సాయంత్రం బద్దలైనట్లు సమాచారం. ఈ సరస్సు భూటాన్‌లో ప్రమాదకరమైనవిగా గుర్తించిన 17 హిమ సరస్సుల్లో ఒకటి. ఘటన తర్వాత నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్లు మోగించారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. సరస్సు నుంచి ఎంతమేర నీరు విడుదలైంది? దిగువ ప్రాంతాలపై దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉండనుంది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

భారత్ పై ప్రభావం.. 

షింటాఫు సరస్సు ఉన్న ప్రాంతం పునత్సాంగ్చు నదీ పరివాహక ప్రాంతంలో ఉంది.ఈ నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సంకోష్‌గా ప్రవహిస్తుంది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌, జల్‌పాయ్ గురి, కూచ్‌బెహార్‌, డార్జిలింగ్‌ కొండ ప్రాంతాలతో పాటు అసోంలోని ధుబ్రి జిల్లాకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా సంకోష్‌ నది తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని అధికారులు సూచించారు. నది ఉప్పొంగితే లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు, వంతెనలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

నీటి ప్రవాహాం.. 

పశ్చిమ బెంగాల్‌ అటవీ శాఖ మంత్రి మనోజ్‌ కుమార్‌ ఒరావ్‌ సంకోష్‌ నది తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కుమార్‌గ్రామ్‌ ప్రాంతానికి గంట నుంచి గంటన్నరలోగా నీటి ప్రవాహం చేరే అవకాశం ఉందని వీడియో సందేశంలో హెచ్చరించారు. ప్రజలు ఆలస్యం చేయకుండా అప్రమత్తం కావాలని కోరారు. డార్జిలింగ్‌ ఎంపీ రాజు బిస్తా కూడా డార్జిలింగ్‌ కొండ ప్రాంతాలు, తెరాయ్‌, డూవార్స్‌ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు కూచ్‌బెహార్‌ జిల్లాలోని తుఫాన్‌గంజ్‌, బక్సిర్‌హాట్‌ ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు.

గ్లేషియల్ లేక్ అవుడ్ బర్డ్స్..

హిమానీనదాలు కరిగి ఏర్పడిన సరస్సుల్లో నిల్వ ఉన్న నీటిని అడ్డుకునే సహజ కట్ట తెగిపోవడం లేదా బలహీనపడటంతో నీరు ఒక్కసారిగా బయటకు దూసుకురావడాన్ని గ్లేసియల్‌ లేక్‌ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్‌ అంటారు. ఈ వరదలు పర్వత లోయల గుండా అత్యంత వేగంగా ప్రవహిస్తూ.. దారిలో మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను కూడా తీసుకెళతాయి. ఫలితంగా నదీ తీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం భూటాన్‌లో సరస్సు బద్దలైన ఘటనతో భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. నీటి ప్రవాహం ఎంత వేగంగా, ఎంత పరిమాణంలో దిగువకు వస్తుందన్న దానిపైనే తదుపరి పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అధికారులు నదీ నీటిమట్టాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలు సురక్షితంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES