Form 47 Sarkar: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో పాకిస్థాన్ వైఖరిపై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారత దౌత్యవేత్త రఘు పూరి సంచలన వ్యాఖ్యలు చేస్తారు. పాకిస్తాన్ ను ‘ఫామ్ 47 ప్రభుత్వం’గా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై దృష్టి పెట్టకుండా తప్పుడు ప్రచారానికి పాక్ ప్రాధాన్యం ఇస్తుందని భారత దౌత్యవేత్త రఘు పూరి ఆరోపించారు. గతంలో పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలే ఇప్పుడు ఆ దేశానికి సమస్య మారాయన్నారు. అయితే ఏంటి ఈ ఫామ్ 47 సర్కార్? పాకిస్తాన్ ను భారత్ ఎందుకలా ట్రోల్ చేసింది..ఇండియా వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
2024లో పాకిస్తాన్ లో జరిగిన ఎన్నికల నుంచి ఈ పదం ఎక్కువగా నానుడిలో ఉంది. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఆరోపణలు చేసింది. ఎన్నికల ఫలితాలను మార్చి షరీఫ్ నేత్రుత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా చూస్తుందనే అంశం వేరే అయినప్పటికీ.. ఎన్నికల ఫలితాల లెక్కల్లో తేడాలు ఉన్నాయన్నది అప్పటి వివాదంలోని ప్రధాన అంశం.
పాకిస్తాన్ ఎన్నికల్లో ఫామ్ 45 అనేది ప్రతి పోలింగ్ కేంద్రంలో నమోదు అయిన ఓట్ల వివరాలను చూపించే పత్రం. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే సమాచారం అందులో ఉంటుంది. ఫామ్ 47 మాత్రం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల ఫలితాలను కలిపి రూపొందించే తాత్కాలిక సమగ్ర ఫలితాల ప్త్రం. అంటే ఫామ్ 45 పోలింగ్ కేంద్రం స్థాయిలో ఫామ్ 47 నియోజకవర్గం స్థాయికి సంబంధించిన ఫలితాలను చూపిస్తాయి.
2024 ఎన్నికలలో..అనేక నియోజకవర్గాలలో ఫారం 45లోని ఓట్ల వివరాలు, ఫారం 47లో నమోదైన గణాంకాలతో సరిపోలలేదని పీటీఐ ఆరోపించింది. తమ మద్దతుతో ఎన్నికలలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులను పోలింగ్ స్టేషన్ల లెక్కల ప్రకారం విజేతలుగా చూపించినప్పటికీ, తుది ఫలితాలలో వారిని ఓడిపోయినవారిగా చూపించారని అది పేర్కొంది.
ఆ ఎన్నికలలో.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని ఫారం 47 పత్రాలలో మార్పులు చేసి ఉండవచ్చని కామన్వెల్త్ ఎలక్షన్ అబ్జర్వర్ నివేదిక కూడా పేర్కొంది.
దీనికి తోడు.. షరీఫ్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి పీటీఐ ఫారం 47 ప్రభుత్వం అనే పదాన్ని ఉపయోగిస్తోంది. అధికారంలోకి రావడానికి ప్రభుత్వం ఎన్నికలలో రిగ్గింగ్ చేసిందని ఆరోపించడమే ఈ పదం వెనుక ఉన్న ఉద్దేశం. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఈ పదాన్ని ప్రస్తావించిన తర్వాత, పాకిస్తాన్ ఎన్నికల విశ్వసనీయతపై వివాదం మరోసారి అంతర్జాతీయ చర్చకు వచ్చింది.