మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60,000 మందికి గుడ్ బై..! స్వచ్ఛంద రాజీనామా ఆఫర్!
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. గతంలో ఏప్రిల్ నెలలో కూడా యూఎస్‌లోని 7 శాతం సిబ్బందికి ఇలాంటి ఆఫరే ఇచ్చింది. స్వచ్ఛందంగా ఉద్యోగులకు ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది. తాజాగా మరోసారి మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమై మొత్తం 60,000 మందికి ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించినట్లు సమాచారం.
Microsoft Offers Buyout Package: యూఎస్, కెనడా, ఇండియా, బ్రిటన్‌లలోని వైస్ ప్రెసిడెంట్, ఆ కింది స్థాయి ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ స్వచ్చందంగా నిష్క్రమించే ఆఫర్ (Voluntary Buyout Programme) ను ప్రకటించింది. ఇందులో భాగంగా రాజీనామా చేసిన వారికి డబ్బులు కూడా చెల్లించనుంది మైక్రోసాఫ్ట్. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 2,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే కేవలం ఆరు నెలల్లో రెండోసారి స్వచ్ఛందంగా ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది. ఇతర టెక్ దిగ్గజ కంపెనీల బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా వెళ్తోంది. ప్రధానంగా తమ ఉద్యోగులకు స్వచ్ఛంద రాజీనామా విధానాన్ని ప్రతిపాదించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇది మైక్రోసాఫ్ట్ చీఫ్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం.. కంపెనీ వెలుపల అవకాశాన్ని వెతుక్కుంటున్న వారికి ఇది ఒక సువర్ణావకాశమని, ఇప్పుడు నిష్క్రమిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సర్దుబాటు చేసుకోవడానికే కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటిస్తోందని తెలిపారు.
రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, ఈ ఆఫర్ ఏఐ ఎక్స్‌పీరియన్స్, కోపైలట్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఎక్స్‌బాక్స్, విండోస్ ప్లస్ డివైసెస్ భద్రత విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుందని సమాచారం. ఇంత పెద్ద ఎత్తున మైక్రోసాఫ్ట్ స్వచ్ఛంద విరమణ ప్రకటిస్తుండటంతో, ఈ సంస్థ ఎక్కడ పెట్టుబడి పెడుతుందన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా మెదిలింది. ఇతర కంపెనీల మాదిరిగానే మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ రంగంలో పెట్టుబడి పెడుతోంది. గతంలో ఏప్రిల్‌లో 7 శాతం మంది ఉద్యోగులకు ఆఫర్ ప్రకటించి 9,000 మందికి అందించింది. ఇప్పుడు మరో 60,000 మంది ఉద్యోగులకు ఇది ప్రతిపాదించింది. మైక్రోసాఫ్ట్ ఏఐ డేటా సెంటర్లు, చిప్‌ల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తగ్గించి ఆ డబ్బును ఏఐ పెట్టుబడులకు మళ్లిస్తోందన్న చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో 9,000 మందికి స్వచ్ఛంద పదవీ విరమణ అందజేసిన మైక్రోసాఫ్ట్, జూలైలో మరో 4,800 మంది ఉద్యోగులకు కోత విధించింది. ఇప్పుడు మరో 60,000 మందికి స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించింది. 2026 జూన్ 30 నాటికి మైక్రోసాఫ్ట్‌లో మొత్తం 2,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఈ కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను 27 శాతం శాతం మేర తగ్గిస్తోంది.
ప్రధానంగా కంపెనీ ఆర్థిక ప్యాకేజీని అందిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కంపెనీలు పనిచేసే విధానాన్ని, ఉద్యోగుల బృందాలను మార్చడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ పెట్టుకుంది. అయితే డేటా సెంటర్లు, సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులకు మాత్రం ఇది వర్తించదు. ఈ బాటను కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, ఏఐలో మరింత పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ గూగుల్ కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. 2022లో మెటా కూడా గరిష్ఠ స్థాయిలో 20,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని తొలగించింది.