Pakistan New Militery Strategy: పాకిస్థాన్ మిలిటరీ వ్యవస్థతో శతృదుర్భేద్యంగా మారాలని ప్రయత్నిస్తోంది. భారత్ క్షిపణుల దాడుల్లో విలవిల్లాడిన పాకిస్థాన్ సర్వశక్తులతో సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఆధునిక డ్రోన్లు, హెలికాప్టర్లు, డుమ్ రుల్ హెలికాప్టర్లు పాకిస్థాన్‌కు రాబోతున్నాయి. యుద్ధసామగ్రి తయారీకి ప్రత్యేక ప్లాంట్లను పాకిస్థాన్ లోనే ఏర్పాటు చేసేందుకు తుర్కియేతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత మిలటరీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అందుబాటులో ఉంటున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో టెక్నాలజీని వినియోగించే వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. రిమోట్ కంట్రోల్‌తో డ్రోన్లను, మానవ రహిత హెలికాప్టర్లతోనూ శతృదేశాలపై విరుచుకుపడే విధంగా పాకిస్థాన్ సమాయాత్తమవుతోంది.
తుర్కియేతో ఆధునిక డ్రోన్లు, రిమోట్ హెలికాప్టర్ల ఆర్డర్..
తుర్కియే దేశంతో లక్ష మెర్కుట్ ఫస్ట్‌పర్సన్ వ్యూ డ్రోన్ల కొనుగోలుకు పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం డ్రోన్లు, యుద్ధసామగ్రిని, మానవరహిత మిలిటరీ వ్యవస్థలను పాకిస్థాన్ కు మూడేళ్లలో ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ఒప్పందం ప్రకారం పది ఆల్పైన్ మానవ రహిత హెలికాప్టర్లు, 25 డుమ్‌రుల్ మినీ హెలికాప్టర్లు, 500 డీఎల్‌ఈ లాయిటరింగ్ మ్యూనిషన్, 250 కోర్గాన్ గ్రౌండ్ వ్యవస్థలు పాకిస్థాన్‌కు చేరవేయబోతున్నారు. తుర్కియేతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌లో వీటి తయారీ ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఆధునిక యుద్ధ సామగ్రి కొనుగోలుకు పాకిస్థాన్ ఒప్పందం..
శతృదేశంపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించే విధంగా డ్రోన్లు పనిచేస్తాయి. పాక్ కొనుగోలు చేయనున్న మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్ల రేంజి 8 కిలోమీటర్లు. ఇవి గాల్లో 20 నుంచి 30 నిమిషాలు ప్రయాణించగలవు. దీనిలో అమర్చిన వార్ హెడ్‌లో విరజిమ్మేందుకు వీలుగా 1,000 వరకు 3 ఎంఎం స్టీల్ బాల్స్ ఉంటాయి. డ్రోన్ పేలిన తర్వాత 20 మీటర్ల రేడియస్‌లో విధ్వంసం సృష్టిస్తాయి.
పేలుడు పదార్థాలను రవాణాలో రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అల్పైన్ మానవ రహిత హెలికాప్టర్లు దాదాపు 200 కిలోల పేలుడు పదార్థాలను దాడులకు తీసుకెళ్లే విధంగా కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఎంచుకున్న ప్రదేశంలో దాడి చేయాల్సిన లక్ష్యం వంటివి ప్రోగ్రామ్ చేస్తే అది అటానమస్‌గా పనిచేస్తుంది. థర్మల్ విజన్ వ్యవస్థలు, నైట్ విజన్ టెక్నాలజీని దీనిలో వాడారు. ఇక డుమ్‌రుల్ వ్యవస్థను షార్ట్ రేంజి నిఘా, దాడి ఆపరేషన్లకు వినియోగిస్తారు. 120 నిమిషాలు ఇది గాల్లో ఉండగలదు. ఇప్పటికే పాక్-తుర్కియే కలిసి ఫిప్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు తయారు చేయాలని నిర్ణయించాయి.
యుద్ధసమయంలో సైనిక నష్టాన్ని తగ్గించేందుకు డ్రోన్ల వినియోగం..
రిమోట్ కంట్రోల్ ద్వారా డ్రోన్లతో శతృదేశంపై విరుచుకుపడే విధంగా మిలటరీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారు. యుద్ధాల్లో రీపర్లు, బైరక్తర్ల పేర్లు తరచూ వినిపించినా.. క్షేత్రస్థాయిలో కీలక దాడులకు ఎఫ్‌పీవీ డ్రోన్లనే అత్యధికంగా వాడుతున్నారు. ఎఫ్‌పీవీ అంటే ఫస్ట్‌పర్సన్ వ్యూ డ్రోన్లు. వీటి ముందు భాగంలో ఓ కెమెరా ఉంటుంది. ఇది చిత్రీకరించిన దృశ్యాలను ఆపరేటర్ ఎఫ్‌పీవీ గాగుల్స్ లేదా వీఆర్‌ఎక్స్ మానిటర్లు ధరించి.. యుద్ధ రంగాన్ని నేరుగా చూస్తాడు. వారికి యుద్ధ రంగంలో ఉన్నట్లే అనిపిస్తుంది. పైలట్ చేతిలోని రిమోట్‌తో దీనిని నియంత్రిస్తూ టార్గెట్‌ను గుర్తించి.. దాడి చేస్తారు. ఇక ఈ డ్రోన్ల మోటార్ల వేగంలో మార్పులు చేసుకుంటే.. అవసరమైనట్లు దీనిని కదలించవచ్చు. దీనిలో పెద్దగా సెన్సార్లు ఉండవు. నియంత్రణ ఆపరేటర్ చేతిలో ఉంటుంది. దీంతో ఆపరేటర్ లక్ష్యాలకు అనుగుణంగా విరుచుకుపడే విధంగా శిక్షణ ఇస్తున్నారు.
ప్రాణ నష్టం లేకుండా.. మిలటరీ వ్యవస్థను పటిష్టం చేస్తున్న పాకిస్థాన్..
పొరుగు దేశాల మధ్య యుద్ధాలు జరిగినపుడు జరిగిన సైనిక ప్రాణ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక టెక్నాలజీతో సైనిక ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. పైలట్లు నేరుగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టకుండా దాదాపు కనీసం 2 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నుంచి దీనిని అపరేట్ చేయవచ్చు. దీంతో మోర్టార్లు, కాల్పుల నుంచి ఆపరేటర్లు బయటపడొచ్చు. ఆపరేటర్ రహస్య బంకర్‌లో దాక్కొని యాంటెనాను బయటపెడితే చాలు.. మిగిలిపని రిమోట్‌గా జరిగిపోతుంది.ఉక్రెయిన్, రష్యా దేశాలు సైనిక కొరత, నష్టాన్ని తగ్గించుకునేందుకు వీటిని విపరీతంగా వాడుతున్నాయి. ఈ డ్రోన్ ధర 500 అమెరికన్ డాలర్ల ఉంటుందని సమాచారం. చాలా చౌకగా ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టొచ్చు. ఈ డ్రోన్ విడిభాగాలు సివిలియన్ మార్కెట్లో తేలిగ్గా లభిస్తాయి. కొన్ని రకాల ఎఫ్‌పీవీ డ్రోన్లు జామింగ్‌ను తట్టుకునేలా అతిపల్చటి వైర్లను కూడా వాడుతున్నారు.
డ్రోన్ల వినియోగం..
సైనిక ప్రాణాలను కాపాడేందుకు ఉక్రెయిన్ తరహాలో డ్రోన్లను విరివిగా వినియోగించాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో వినియోగించిన డ్రోన్ల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఒక్కటే మిలియన్ల కొద్దీ ఉత్పత్తి చేస్తోంది. 2025లో దాని సైన్యానికి 30 లక్షల డ్రోన్లు ఇచ్చింది. ప్రస్తుతం ఈ యుద్ధంలో రోజువారీ దాడుల్లో దాదాపు 60శాతం వీటి ద్వారానే జరుగుతున్నట్లు సమాచారం. ఒక దశలో ఉక్రెయిన్ ఒక్క నెలలోనే 80 వేల దాడులు చేసింది. పొరుగుదేశాలమధ్య యుద్ధాలపై అధ్యయనం చేసిన పాకిస్థాన్ మిలటరీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో డ్రోన్లు, రిమోట్ హెలికాప్టర్లను విరివిగా తెప్పించుకుంటోందని సమాచారం.