BCCI Indian Senior Cricketers: ఇంటర్నేషన్ క్రికెట్‌లో టీమిండియాది ప్రత్యేక స్థానం ఉంది. అది టెస్టు క్రికెట్ అయినా.. వన్డేగానీ, టీ20 గానీ టీమిండియాదే పైచేయి అనే స్థాయిలో ప్లేయర్లు రాటుదేలారు. భారీ టార్గెట్లను సులభంగా ఛేజ్ చేసేస్తున్నారు. టీ20 మ్యాచుల్లో విధ్వంసం సృష్టించే ప్లేయర్లు దూసుకొచ్చేశారు. యువకెరటం వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ కాసేపు క్రీజులో నిలబడితే ఆట స్వరూపాన్నే మార్చేస్తున్నారని ఇటీవల జరిగిన మ్యాచుల్లో నిరూపించారు. భారీ టార్గెట్లను ఛేదించి టీమిండియాను విజేతగా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో వన్డేల్లోనూ, టెస్టు క్రికెట్లోనూ యువరక్తంతో టీమ్ ను సిద్ధంచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వైదొలగనున్న సీనియర్లు..
టీమిండియాలో సుధీర్ఘకాలంగా ఉంటున్న సీనియర్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా రిటైరయ్యే ఆలోచన చేస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా బీసీసీఐ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తుండటం వీరి కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. ఇటీవల అజింక్య రహానే, కేఎస్ భరత్, విజయ్ శంకర్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆటకు వీడ్కోలు పలికారు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన జడేజా, ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్ల నుంచి తీవ్ర పోటీ ఉండటంతో పాటు వయసు రీత్యా త్వరలోనే తన కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వెటరన్ స్టార్లు ఆటకు వీడ్కోలు..
టీమిండియాలోకి కొత్త యేడాదిలో కొత్తవాళ్లు చేరే అవకాశాలున్నాయి. వయసు మీద పడటం, అవకాశాలు రాకపోవడం వంటి కారణాల చేత పలువురు వెటరన్ స్టార్లు ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి స్థానాలు భర్తీ చేసే క్రమంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఏదైనా మహ్మద్ షమీకి ఇటీవలి కాలంలో అవకాశాలు రావడం లేదు. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించి, దేశవాలీ టోర్నీల్లో రాణిస్తున్నా సెలెక్టర్లు చిన్నచూపు చూస్తున్నారు. ప్రస్తుతం షమీ వయసు 35 ఏళ్లు. ఏ రకంగా చూసినా షమీ ఎన్నో రోజుల ఆటలో కొనసాగే అవకాశం లేదు. అవకాశాలు వచ్చినా ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి లేదు. సాధారణంగానే ఫాస్ట్ బౌలర్లకు కెరీర్ స్పాన్ తక్కువ. 35 ఏళ్ల వచ్చాయంటే రిటైర్మెంట్ స్టేజీలో ఉన్నట్లే. ఈ లెక్కన షమీ ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
రాజకీయాల్లోకి యుజ్వేంద్ర చహల్..
భారత వెటరన్ స్టార్ యుజ్వేంద్ర చహల్. చహల్ 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాత దాదాపుగా కనుమరుగైపోయాడు. యువ స్పిన్నర్లు బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం చహల్‌కు మైనస్ అయిపోయింది. చహల్ బౌలింగ్‌లో అద్భుతాలు చేయగలిగినా బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా పెర్ఫార్మెన్స్ లేకుండా పోయింది. దీంతో చాహల్ కెరీర్‌ను ఎండ్ కార్డ్ పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ పార్టీలో చేరి రాజకీయాల్లో ప్రవేశించి కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. యువకులతో పోటీ కూడా చహల్‌కు మైనస్ అవుతున్నాయి. ప్రస్తుతం అతని వయసు 35. వయసును పక్కన పెట్టినా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి అడ్డంకులను దాటుకొని రావాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. కాబట్టి ఈ ఏడాదే చహల్ కెరీర్‌కు కూడా ఎండ్ కార్డ్ పడవచ్చు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్..
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... వీరిద్దరూ ఇప్పటికే టీ20లు, టెస్టుల నుంచి తప్పుకుని కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత వీరు అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా షమీ జాతీయ జట్టులో రెగ్యులర్ స్థానం కోల్పోయారు. యువ పేసర్ల రాకతో 36 ఏళ్ల షమీకి మళ్లీ జట్టులో అవకాశం దక్కడం కష్టంగా మారింది. యుజ్వేంద్ర చాహల్ 2023 తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ లో ఎక్కడా కన్పించలేదు. కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ వంటి స్పిన్నర్ల పోటీ వల్ల జట్టుకు దూరమయ్యారు. ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్. వీరిద్దరూ 2021-2023 తర్వాత భారత జట్టుకు ఆడలేదు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌కే పరిమితమయ్యారు. 37 ఏళ్లు పైబడటంతో ఏ క్షణమైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలున్నాయి. భువనేశ్వర్ కుమార్. ఐపీఎల్‌లో రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్లు యువ బౌలర్ల వైపు మొగ్గు చూపుతుండటంతో భువనేశ్వర్ కుమార్‌కు జాతీయ జట్టు తలుపులు దాదాపు మూసుకుపోయాయి.
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డే, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికి జట్టులో అతని స్థానానికి ఢోకా లేనప్పటికీ.. వయసు పైబడటం దృష్ట్యా అతనే స్వచ్చందంగా ఆటకు వీడ్కోలు పలకవచ్చు. ఇప్పటికే అతని వారసుడిగా అక్షర్ పటేల్ ప్రమోట్ అయ్యాడు. జడ్డూ ఈ ఏడాది టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించకపోయినా వన్డేల నుంచైనా తప్పుకునే అవకాశం ఉంది.
సూర్య కుమార్ యాదవ్ పరిస్థితి..
భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. వ్యక్తిగతంగా విఫలమవుతుండటంతో ఇప్పటికే అతని ఉనికి ప్రమాదంలో పడింది. సూర్యకుమార్ యాదవ్ టీ20 టీమ్ లో ఎక్కువ రోజులు కొనసాగడం అసాధ్యంగా కనిపిస్తుంది.
టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున త్రిబుల్ సెంచరీ సాధించిన అరుదైన బ్యాటర్లలో ఒకడైన కరుణ్ నాయర్‌కు కూడా జట్టులో అవకాశం దక్కడం లేదు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చినా వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేక పోవడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతని రీఎంట్రీ అవకాశాలు కూడా చాలా స్వల్పంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ కూడా యువ ఆటగాళ్ల రాకతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. కొత్త తరానికి ప్రాధాన్యం పెరగడంతో అతని అవకాశాలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో శార్దుల్ కూడా తన భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ప్రపంచ క్రికెట్ టీముల్లో టీమిండియా ప్రభావశీలమైన జట్టుగా గుర్తింపు సాధించింది. సీనియర్ ప్లేయర్లు తప్పుకున్న తర్వాత భారీ స్కోర్లు బాదే యువ సంచలనాలతో ప్రత్యేక జట్టుగా రూపుదిద్దుకోబోతోంది. 2027లో అనేక సంచలనాలకు టీమిండియా వేదికగా నిలవబోతోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
(రచయత..మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో..)