Tamil Nadu wedding controversy: పెళ్లి అంటే నూరేళ్ల బంధం అంటారు.. కానీ, ఈ మధ్య కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లకు ఆయుష్షు కూడా తక్కువే.. తమిళనాడులో జరిగిన ఈ వింత పెళ్లికి ఒక్కరోజు కూడా నిలవలేదు. నాలుగేళ్లుగా అత్యంత ఘాడంగా ప్రేమించుకున్నవారు ఒక్కరోజులోనే బ్రేకప్ చెప్పుకున్నారు. ఉదయం బంధుమిత్రులతో కలిసి కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా పెళ్లి వేడుకలు జరుపుకున్నవారు సాయంత్రానికే విడిపోయారు. ఈ ఘటన సోమవారం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కులచ్చల్ ప్రాంతంలో జరిగింది. 31 ఏళ్ల సైనికుడు, కేరళ సరిహద్దు ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఫార్మసిస్ట్ను నాలుగేళ్లుగా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నప్పటికీ, సాయంత్రం జరిగిన చిన్న గొడవతో వారు విడిపోవాల్సి వచ్చింది.
అసలు వివాదం ఏమిటి?
నాలుగేళ్లుగా ప్రేమించుకున్న వీరి మధ్య ప్రేమ హాయిగా కొనసాగింది. మొదట్లో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. కానీ ఇరు కుటుంబాలను ఒప్పించడానికి వీరికి చాలా సమయం పట్టింది. చివరికి వారి ప్రేమను చూసి పెద్దలు ఒప్పుకుని, సోమవారం ఘనంగా పెళ్లి జరిపించారు. అయితే, అదేరోజు సాయంత్రం వరుడు తన ఇంటి వద్ద ఉన్న వెడ్డింగ్ హాల్లో విందు కూడా ఏర్పాటు చేశాడు. అయితే, పెళ్లి రోజే వరుడు మద్యం సేవించడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన వధువు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. వధువు తండ్రి వరుడి వద్దకు వెళ్లి, అతనికి తాగుడు అలవాటు ఉందా? అని నిలదీయడంతో, మత్తులో ఉన్న వరుడు మామను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. గొడవను ఆపడానికి వధువు ప్రయత్నించగా, మత్తులో ఉన్న వరుడు ఆమెపై కూడా చేయి చేసుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలోనే జరిగిన ఈ గొడవ వల్ల పెళ్లి వేడుకలోని ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది.
గాయపడిన కూతురికి వెంటనే భర్తతో తండ్రి తెగదెంపులు చేసుకుని వెంటనే అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. అనంతరం కులచ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి రోజే వరుడు తన కూతురుపై చేయి చేసుకోవడంతో, ఆ బాధను భరించలేక తండ్రి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం వరుడు పరారీలో ఉన్నాడు. ఇలా నాలుగేళ్ల ప్రేమబంధానికి ఒక్కరోజులోనే ఎండ్ కార్డ్ పడినట్లయింది. ప్రధాన కారణం మద్యం. పెళ్లి రోజే మద్యం సేవించడం అత్యంత దారుణం. చేతులార చేసుకున్న వరుడు తన నాలుగేళ్ల బంధానికి ఇలా బ్రేక్ వేసుకున్నాడు.