Dhanush Meet 3000 Women: తమిళ స్టార్ హీరో ధనుష్ ఆదివారం నాడు చెన్నైలో తన అభిమాన సంఘానికి చెందిన మహిళా విభాగం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 3000 మంది మహిళలు హాజరయ్యారు. ఈ భేటీ సందర్భంగా వారందరితో సరదాగా ఫొటోలు దిగిన ఆయన, పండుగ సందర్భంగా వారికి దీపావళి కానుకగా వెండి దీపాలను స్వయంగా అందజేశారు.
కమలం ముద్ర వివాదం..
మహిళా అభిమానులకు అందజేసిన ఆ వెండి దీపాలపై భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎన్నికల చిహ్నమైన కమలం గుర్తు ముద్రించి ఉండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ఊహాగానాలు తెరపైకి వచ్చి, తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తమిళనాడులో భారతీయ జనతా పార్టీలో చేరి.. స్ట్రాంగ్ పిల్లర్‌గా మారనున్నారనే చర్చకు నాంది పలికింది. ఈ పరిణామంపై కాంగ్రెస్‌తో పాటు పలువురు ఇతర రాజకీయ నాయకులు సైతం వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.
అభిమాన సంఘం వివరణ..
ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో ధనుష్ అభిమాన సంఘమైన 'ధనుష్ నర్పణి ఇయక్కం' ప్రతినిధులు దీనిపై స్పష్టతనిచ్చారు. ఆ దీపాలపై కనిపించిన కమలం గుర్తు కేవలం ఆ వస్తువులను తయారుచేసిన తయారీదారునికి సంబంధించిన ముద్ర మాత్రమేనని పేర్కొన్నారు. అందువల్ల ఆ గుర్తుకు రాజకీయాలతో ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేదని వారు తేల్చిచెప్పారు.
ధనుష్ కొత్త పార్టీ ప్రచారం..
అయినప్పటికీ ధనుష్ రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారం ఆగడం లేదు. ఆయన 'తమిళగ ఎళుచ్చి కళగం' పేరుతో సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు, ఆ పేరును ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద నమోదు చేశారంటూ వార్తలు జోరందుకున్నాయి. వీటికి తోడు, ఇటీవల ఆయన తన అభిమాన సంఘం పేరును 'ధనుష్ నర్పణి ఇయక్కం'గా మార్చడం, రాష్ట్రవ్యాప్తంగా నూతన నిర్వాహకులను నియమించడం వంటి పరిణామాలు ఈ రాజకీయ రంగప్రవేశ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.